
మహిళను కత్తులతో బెదిరించి బంగారు అపహరణ
బెళుగుప్ప: ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను కత్తులతో బెదిరించి బంగారు నగలు, నగదు అపహరించిన ఘటన సంచలనం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన మేరకు... బెళుగుప్ప మండలం రామసాగరం గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్న తోటలో తన కుమారుడు శ్రీనాథరెడ్డితో కలసి ముడిమి లక్ష్మీదేవి నివాసముంటోంది. సోమవారం రాత్రి కూరగాయలు తీసుకు వచ్చేందుకు శ్రీనాథ్‌రెడ్డి రామసాగరం గ్రామానికి వెళ్లాడు. ఆ సమయంలో గదిలో లక్ష్మీదేవి వంట చేస్తుండగా ముగ్గురు ఆగంతకులు లోపలకు ప్రవేశించారు. వంట గదిలో ఉన్న లక్ష్మీదేవిని వెనుక నుంచి అదిమిపట్టి కిందపడేసి కత్తులతో బెదిరిస్తూ నోట్లోకి గుడ్డలు కుక్కారు. ఆమె శరీరంపై ఉన్న బంగారు చైను, చేతిలోని నాలుగు బంగారు గాజులు లాక్కొని, ఇంట్లో ఉన్న రూ.96వేల నగదును అపహరించారు. కొద్ది సేపటికి ఇంటికి చేరుకున్న కుమారుడు విషయం తెలుసుకున్ని గ్రామంలోకి వెళ్లి బంధువులకు, గ్రామస్తులకు తెలపడంతో చుట్టుపక్కల గాలింపు చేపట్టారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాసులు, ప్రొబేషనరీ డీఎస్పీ అస్రప్ అలీ, సీఐలు మహానంది, ప్రవీణ్‌కుమార్, విడపనకల్లు, వజ్రకరూరు ఎస్‌ఐలు ఖాజాహుస్సేన్, నాగస్వామి, బెళుగుప్ప ఎస్‌ఐ శివ పరిశీలించారు. స్నిప్పర్ డాగ్‌ను రంగంలో దించారు. క్లూస్ టీం సాయంతో నిందితుల వేలి ముద్రలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.