
చేదు మిగిల్చిన మామిడి
తలుపుల: అందరికీ తీపి పంచిన మామిడి పండించిన రైతుకు మాత్రం చేదును మిగిల్చింది. సీజన్‌లో అరకొరగా వచ్చిన కాయలు కూడా ఊజీపురుగుల దెబ్బతో రాలిపోతున్నాయి. దీంతో ఎకరం సాగుకు రూ.35 వేల నుంచి రూ.40 వేలు ఖర్చు అయ్యిందని, ప్రస్తుతం పెట్టుబడి కూడా దక్క లేదని రైతులు వాపోతున్నారు.
ప్రత్యామ్నాయం మామిడే
సంప్రదాయ పంటలు సాగుచేసి నష్టపోయిన రైతులు ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలవైపు దృష్టి సారించారు. అందులోనూ ఎక్కువగా మామిడిపైనే మక్కువ పెంచుకున్నారు. ఇన్నాళ్లూ సకాలంలో వర్షాలు కురిసి, దిగుబడి బాగా రావడంతో రైతులు ఆనందంగా మామిడి తోటలు సాగు చేశారు. ఫలితంగా జిల్లాలో ఏటికేడు మామిడి విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది.
రైతును విస్మరించిన కూటమి సర్కార్
ప్రకృతి వైపరీత్యాలు, ఇతరత్రా కారణాలతో పంట నష్టపోయినా ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో రైతులు ఫసల్‌బీమా చెల్లించారు. జిల్లా వ్యాప్తంగా 2,353 మంది రైతులు 2013 ఎకరాలకు ఫసల్ బీమా చేశారు. గత నవంబర్‌లో వర్షాభావ పరిస్థితులతో జనవరి వరకు మామిడి తోటల్లో పూత ఆలస్యమైంది. ఆ తర్వాత ఎండ తీవ్రత, వాతావరణ పరిస్థితులతో పిందెలు నిలబడక కాపు అరకొరగానే కాసింది. దీంతో మే నెల దాటి జూన్ చివరికి వచ్చినా చాలా ప్రాంతాల్లో పంట తొలగించలేని పరిస్థితి ఏర్పడింది. పోనీ అరకొర పంటనైనా తొలగించుకుని విక్రయిద్దామంటే... నెలరోజులుగా కురుస్తున్న వర్షాలకు కాయలకు ఊజీ పురుగులు పట్టాయి. దీంతో కాయలన్నీ రాలిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.
ఊసేలేని ఫసల్ బీమా
పంటలు నష్టపోయిన రైతులకు గత ప్రభుత్వం ఫసల్ బీమా కింద పరిహారం అందించి ఆదుకునేది. అదికూడా పంట కాలం పూర్తయ్యేలోపే ఆర్థిక సాయం అందించేది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం పంటకాలం పూర్తయినా ఇంకా పంటనష్టపరిహారం అంచనాలే రూపొందించకుండా అన్యాయం చేస్తోందని రైతులు మండిపడుతున్నారు.
అరకొర కాపు.. దానికీ ‘ఊజీ’ దెబ్బ
లబోదిబోమంటున్న రైతన్నలు
బీమా ఊసే ఎత్తని కూటమి సర్కార్
రైతులను ఆదుకోవాలి
ఏ సీజన్‌లో సాగు చేసిన పంటల వివరాలను ఆ సీజన్‌లోనే సేకరించాలి. పక్కాగా పంట నమోదు చేసి నష్టపోయిన వారికి బీమా పరిహారం అందించాలి. అప్పుడే రైతులకు మేలు జరుగుతుంది. లేకపోతే వ్యవసాయం మానుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. – జి.వెంకటరమణ,
టి.రెడ్డివారిపల్లి, తలుపుల మండలం
పరిహారం అందించాలి
మామిడి సాగు చేసిన రైతులంతా ఫసల్ బీమా చేశారు. అందువల్ల నష్టపోయిన ప్రతి రైతుకూ సకాలంలో బీమాతో పాటు, నష్ట పరిహారం వర్తింపజేసి ఆదుకోవాలి. ఈ మేరకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి.
– వై. మోహన్‌రెడ్డి, ఎనమలదొడ్డివారిపల్లి,
తలుపుల మండలం

చేదు మిగిల్చిన మామిడి

చేదు మిగిల్చిన మామిడి