
నిరంతరాయ విద్యుత్ సరఫరాకు చర్యలు
● ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ వరకుమార్
ధర్మవరం: ఎలాంటి కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అయ్యేలా తగు చర్యలు తీసుకుంటామని ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ వరకుమార్ తెలిపారు. మంగళవారం ఆయన పట్టణంలో విద్యుత్‌శాఖ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం పట్టణంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లను పరిశీలించారు. ఏవైనా సమస్యలున్నాయా.. అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వరకుమార్ మాట్లాడుతూ... వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. రైతుల నుంచి అందే ఫిర్యాదులపై తక్షణం స్పందించి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామన్నారు. వినియోగదారులు కూడా తమ సమస్యలను నేరుగా విద్యుత్ అధికారులకు తెలియజేయాలన్నారు. లో ఓల్టేజి సమస్యను పూర్తిగా నివారిస్తామన్నారు. అందుకోసం అవసరమైన చోట ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలను మార్చుతున్నామని వివరించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ సంపత్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శివరామ్, ఏడీ లక్ష్మీ నరసింహారెడ్డి, ఏఈలు నాగభూషణం, కొండయ్య, జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు.
సచివాలయాల్లో పేపరు కొరత
● ధ్రువీకరణ పత్రాలు అందక రైతులు, విద్యార్థుల ఇబ్బందులు
నల్లమాడ: మండలంలోని పలు గ్రామ సచివాలయాల్లో ప్రింటెడ్ పేపర్ల కొరత నెలకొంది. ప్రస్తుతం బ్యాంకుల్లో పంట రుణాల రెన్యూవల్ జరుగుతోంది. పంటరుణం రెన్యూవల్ చేయాలంటే రైతులు తప్పనిసరిగా ఒరిజినల్ వన్–బీ బ్యాంక్‌లో సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఒరిజినల్ వన్–బీ ప్రింట్ తీసే పేపర్లు సచివాలయాల్లో స్టాకు లేకపోవడంతో రైతులు వన్–బీ పొందలేకపోతున్నారు. సకాలంలో పంట రుణాలు రెన్యూవల్ చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ప్రింటెడ్ పేపర్లు లేకపోవడంతో కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల మంజూరులోనూ జాప్యం జరుగుతోందని విద్యార్థులు వాపోతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమైన తరుణంలో తక్షణం సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
సమష్టి కృషితోనే
బాల్య వివాహాలకు చెక్ ●
● బాల్య వివాహాల అనర్థాలపై
అవగాహన కల్పించండి
● అధికారుల సమీక్షలో ఆర్డీఓ మహేష్
ధర్మవరం అర్బన్: సమష్టి కృషితోనే బాల్య వివాహాలు జరగకుండా చెక్ పెట్టవచ్చని ఆర్డీఓ మహేష్ తెలిపారు. ధర్మవరం ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి బాల్యవివాహాలను నివారించాలని సూచించారు. అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు నిండిన తర్వాతనే వివాహం చేయాలన్నారు. గ్రామ, పట్టణ స్థాయిలో బాల్య వివాహాల నివారణ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించి బాల్యవివాహాలు చేయాలని చూస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తారని హెచ్చరించారు. బాల్య వివాహం బలవంతంగా చేసే వారిపై పోక్సో చట్టం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. బాల్య వివాహాలతో అనారోగ్య సమస్యలతోపాటు నిరక్ష్యరాస్యత, కుటుంబ సమస్యలు తీవ్రతరం అవుతాయని వివరించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే తహసీల్దార్, పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు, లేదా టోల్ ఫ్రీ నంబర్ 1098కు తెలియజేయాలన్నారు. బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రతిఒక్క అధికారి పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు సురేష్‌బాబు, భాస్కర్‌రెడ్డి, సురేష్‌కుమార్, నారాయణస్వామి, మున్సిపల్ టీపీఆర్‌ఓ పెనుబోలు విజయ్‌భాస్కర్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

నిరంతరాయ విద్యుత్ సరఫరాకు చర్యలు