
సొంత మండలంలో అవకాశమివ్వండి
● డీపీఓకు సచివాలయ ఉద్యోగుల వినతి
ఓడీచెరువు : సచివాలయ ఉద్యోగులకు సొంత మండలంలోనే బదిలీలకు అవకాశం కల్పించాలని సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దాదాగిరి చౌడప్ప కోరారు. ఈ మేరకు కొండకమర్ల సచివాలయాన్ని తనిఖీ చేసేందుకు మంగళవారం విచ్చేసిన డీపీఓ సమతను కలిసి వినతిపత్రం అందజేశారు. సచివాలయ ఉద్యోగుల బదిలీలు, రేషనలైజేషన్‌కు సంబంధించిన జీఓ సాకుతో సొంత మండలాలకు బదిలీ కాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. ఈ జీఓను పునఃపరిశీలించాలని కోరారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తూ సంక్షేమ పథకాల అమలుకు నిత్యం కృషి చేస్తున్న తమ సేవలను గుర్తించాలన్నారు. ఇప్పటికే ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తమకు ప్రమోషన్ కల్పించిన తరువాతనే రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టాలని కోరారు. జాయినింగ్ తేదీ నుంచి సర్వీసును పరిగణనలోకి తీసుకొని రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, ఆలస్యంగా ప్రొబేషన్ ప్రకటించినందున 9 నెలల కాలానికి ఆరియర్స్ మంజూరు చేయాలని కోరారు. అలాగే క్యాడర్ గుర్తింపు, టెక్నికల్ పదోన్నతులు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో మండల సచివాలయ ఉద్యోగులు బాబ్జాన్, నరేంద్ర, అంజి నాయక్, విజయ్, కుళ్ళాయప్ప, గౌసియా తదితరులు పాల్గొన్నారు.