
ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించండి
ప్రశాంతి నిలయం: తమ న్యాయపరమైన సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలంటూ ప్రభుత్వాన్ని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజ్‌బేగంను కలసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. వేతనాలు పెంచాలని, లేబర్ కోడ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జూలై 9వ తేదీలోపు సమస్య పరిష్కారం కాకపోతే సమ్మెలోకి వెళతామంటూ హెచ్చరించారు. కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు సాంబశివ, నాయకులు గంగాధర్, శివ, ఫకృద్దీన్, ఆశా కార్యకర్తల యూనియన్ జిల్లా నాయకులు ముంతాజ్, శబరి, అంజినమ్మ, వరలక్ష్మి, మమత, గంగులమ్మ తదితరులు పాల్గొన్నారు.
వివాహిత హత్య కేసులో భర్తకు రిమాండ్
కనగానపల్లి: మండల కేంద్రం కనగానపల్లిలో వివాహితను హత్య చేసిన కేసులో ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. కనగానపల్లికి చెందిన వివాహిత కళావతిని శనివారం సాయంత్రం ముళ్లపొదల వద్ద ఆమె భర్త రాఘవ కొట్టి చంపిన విషయం తెలిసిందే. హతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు రామగిరి సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో కనగానపల్లి పోలీసులు విచారణ చేపట్టి సోమవారం నిందితుడు రాఘవను అరెస్ట్ చేశారు. అనంతరం ధర్మవరం కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
‘పీఎం సూర్యఘర్’ను వేగవంతం చేయండి●
● ఎస్పీడీసీఎల్ సీజీఎం వరకుమార్
అనంతపురం టౌన్: పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా అందిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఏపీ ఎస్పీడీసీఎల్ సీజీఎం వరకుమార్ ఆదేశించారు. సోమవారం అనంతపురంలోని ఎస్‌ఈ కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులు, బ్యాంకర్లతో ఆయన సమావేశమై మాట్లాడారు. పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా విద్యుత్ వినియోగదారులు తమ ఇళ్లపై సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఇంటి అవసరాలకు వినియోగించడంతో పాటు మిగులు విద్యుత్‌ను సంస్థకు విక్రయించుకునేందుకు అవకాశం ఉందన్నారు. కిలో వాట్ల వారీగా సోలార్ ఫ్యానళ్ల ఏర్పాటుకు బ్యాంకర్లు సైతం రుణాలను అందజేయాలన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను అందజేస్తోందన్నారు. పీఎం సూర్యఘర్ పథకానికి వచ్చిన దరఖాస్తులను ఆయా ప్రాంతాల బ్యాంకర్లుతో సమన్వయం చేసుకొని గ్రౌండింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఈఈ, ఏడీలను అదేశించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ శేషాద్రి శేఖర్, ఈఈ జేవీ రమేష్, ఏడీలు శ్రీనివాసులు, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించండి