
సహకార బ్యాంకులను లాభాల బాట పట్టిద్దాం
● డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జి
ముంటిమడుగు కేశవరెడ్డి
అనంతపురం అగ్రికల్చర్: సహకార బ్యాంకులను లాభాల బాట పట్టించి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచేలా చేద్ధామని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఉద్యోగులకు ఆ బ్యాంక్ పర్సన్ ఇన్‌చార్జి ముంటిమడుగు కేశవరెడ్డి పిలుపునిచ్చారు. నూతనంగా ఆయన బాధ్యతలు తీసుకున్న అనంతరం సోమవారం స్థానిక డీసీసీబీ హాల్‌లో సీఈఓ కె.సురేఖారాణి అధ్యక్షతన జరిగిన 129న మహాజన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులకు ప్రాధాన్యతనిస్తూనే మిగిలిన వర్గాలకు బ్యాంకింగ్ సేవలు అందించి సమష్టి కృషితో బ్యాంకు పురోభివృద్ధికి పాటుపడాలని కోరారు. 2024–25 ఆర్థిక సంవత్సరం ఆడిట్ రిపోర్టు, జమా ఖర్చులను మహాజనసభ ఆమోదించింది. అలాగే 2025–26 బడ్జెట్ కేటాయింపులపై చర్చించారు. గతేడాదికి సంబంధించి రూ.1.55 కోట్లను బైలా ప్రకారం వివిధ పద్ధులకు కేటాయించారు. సమావేశంలో డీజీఎంలు, ఏజీఎంలు, మేనేజర్లు, పీఏసీఎస్ చైర్మన్లు పాల్గొన్నారు.
యువకుడి బలవన్మరణం
కనగానపల్లి: వ్యసనాలు మాని బుద్ధిగా ఉండాలని తల్లిదండ్రులు మందలించడాన్ని జీర్ణించుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కనగానపల్లి మండలం దాదులూరు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి కేశవయ్య, ముత్యాలమ్మ దంపతులకు కుమారుడు నరేష్ (20), కుమార్తె ఉన్నారు. పదో తరగతి వరకూ చదువుకున్న నరేష్ ఆ తర్వాత పై చదువులకు వెళ్లకుండా సెంట్రింగ్ పనులతో కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. ఈ క్రమంలో స్నేహితులతో కలసి వ్యసనాలకు బానిసగా మారి జులాయిగా తిరగసాగాడు. తండ్రి పలుమార్లు హెచ్చరించినా మారలేదు. దీంతో ఆదివారం రాత్రి గట్టిగా మందలించి, గొర్రెల మంద వద్దకు కాపలాకు వెళ్లాడు. ఆ సమయంలోతల్లి, చెల్లి ఆరుబయట నిద్రిస్తుండగా ఇంట్లో పడుకున్న నరేష్ అర్ధరాత్రి దూలానికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం నిద్ర లేచిన తల్లి ముత్యాలమ్మ తలుపులు తెరవగా దూలానికి వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న కుమారుడిని చూసి గట్టిగా కేకలు వేసింది. చుట్టూపక్కల వారు అక్కడకు చేరుకుని అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు.

సహకార బ్యాంకులను లాభాల బాట పట్టిద్దాం