
హామీలు నెరవేర్చడం చేతకాకపోతే గద్దె దిగండి
ప్రశాంతి నిలయం: ఎన్నికల సమయంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు కూటమి నాయకులు ఇచ్చిన హామీలను అధికారం చేపట్టి ఏడాది గడిచినా పాలకులు పరిష్కరించలేకపోయారని, హామీలను నెరవేర్చే సత్తా లేకపోతే వెంటనే గద్దె దిగిపోవాలంటూ కూటమి ప్రభుత్వాన్ని అంగన్‌వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనలో భాగంగా సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అంతకు ముందు స్థానిక గణేష్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నాలో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మాబున్నీషా, కోశాధికారి శ్రీదేవి మాట్లాడారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడంతో కనీసం రేషన్ కార్డుకు కూడా నోచుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఆర్వో విజయసారథికి అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, కార్యదర్శి ఈఎస్ వెంకటేష్, నాయకులు జీఎల్ నరసింహులు, లక్ష్మీనారాయణ, పెడపల్లి బాబా సాంబశివ, దిల్షాద్, అంజి, గంగాధర్ , పెద్ద సంఖ్యలో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు.
ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అంగన్‌వాడీ కార్యకర్తలు
కలెక్టరేట్ ఎదుట ధర్నా