
‘పోలీసు స్పందన’కు 50 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 50 వినతులు అందాయి. డీఎస్పీ ఆదినారాయణ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో లీగల్ అడ్వైజరీ సాయినాథరెడ్డి, ఎస్‌బీ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి పాల్గొన్నారు
ఎస్‌ఎస్‌ఈ బోర్డు
కార్యాలయం మార్పు
అనంతపురం ఎడ్యుకేషన్: కృష్ణా జిల్లా విజయవాడలోని గొల్లపూడిలో ఆంధ్ర హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఎస్‌ఎస్‌ఈ బోర్డు (ప్రభుత్వ పరీక్షల) కార్యాలయాన్ని గుంటూరు జిల్లా మంగళగిరిలోని కళాశాల విద్య కమిషనర్ కార్యాలయం పక్కన సర్వీస్‌రోడ్డులో ఉన్న గరుడవేగ టవర్స్‌లోకి మార్పు చేశారు. ఈ మేరకు డీఈఓ ప్రసాద్‌బాబు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ తెలిపారు. సోమవారం నుంచి కార్యకలాపాలు అక్కడి నుంచే సాగుతున్నాయని పేర్కొన్నారు.
రైలు ఎక్కబోతూ కింద పడి యువకుడి మృతి
తాడిమర్రి: రైలు ఎక్కబోతూ అదుపు తప్పి కిందపడి ఓ యువకుడు మృతిచెందాడు.. అనంతపురంలో రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు.. తాడిమర్రి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన కల్లే శ్రీరాములుకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెను అదే గ్రామానికి చెందిన గోపాల్‌కు ఇచ్చి వివాహం చేశారు. కుమారుడు సుధాకర్(26) డిగ్రీ వరకు చదువుకుని తిరుపతికి వెళ్లేందుకు సిద్ధమైన సుధాకర్.. ఆదివారం సాయంత్రం అనంతపురం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. రాత్రి 8 గంటలకు ఉన్న కదిరిదేవరపల్లి–తిరుపతి ట్రైన్ తప్పిపోవడంతో సోమవారం వేకువజామున వచ్చిన రైలును ఆలస్యంగా గమనించి ఎక్కేందేకు సిద్ధమయ్యాడు. అప్పటికే రైలు ముందుకు కదలడంతో ఎక్కేందుకు ప్రయత్నిస్తూ పట్టు తప్పి కింద రైలు కిందపడి రెండు ముక్కలయ్యాడు. మృతుడి జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా తాడిమర్రి మండలం ఆత్మకూరు గ్రామ వాసిగా గుర్తించి ఇక్కడి పోలీసులకు రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

‘పోలీసు స్పందన’కు 50 వినతులు