
ఆటోలో ప్రసవం..తల్లీబిడ్డ క్షేమం
సోమందేపల్లి: కాన్పు కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా పురిటినొప్పులు ఎక్కువ కావడంతో మార్గమధ్యంలో ఆటోలోనే ఓ గర్భిణి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని పందిపర్తి గ్రామానికి చెందిన గర్భిణి మంజులకు ఆదివారం అర్ధరాత్రి పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో కుటుంబీకులు ఆమెను ఆటోలో సోమందేపల్లి ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే మంజుల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా హిందూపురం ఆస్పత్రికి తీసుకువెళ్లాలని వైద్య సిబ్బంది సూచించారు. దీంతో కుటుంబీకులు ఆమెను ఆటోలో హిందూపురం తరలిస్తుండగా.. మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువ కావడంతో వెంట వెళ్తున్న అంగన్‌వాడీ కార్యకర్త పల్లవి, హెల్పర్ ఉషా ఆటోలోనే మంజులకు కాన్పు చేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.