
24 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: తుపాను ప్రభావంతో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ జిల్లాలోని 24 మండలాల పరిధిలో మోస్తరు వర్షం కురిసింది. సగటున 9.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా పుట్టపర్తి 26.4 మి.మీ, తలుపుల మండలంలో 24.6 మి.మీ, నల్లమాడ మండలంలో 24.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక బుక్కపట్నం మండలంలో 23 మి.మీ, కొత్తచెరువు 21.8, రామగిరి 20.6, సోమందేపల్లి 19.4, గోరంట్ల 19.2, రొద్దం 13.8, అమడగూరు 13.8, అమరాపురం 12.8, తనకల్లు 12.4, పెనుకొండ 11, ఓడీ చెరువు 10.2, కదిరి 7.2, అగళి 6.2, సీకేపల్లి 5.8, నల్లచెరువు 4.2, మడకశిర 4, ధర్మవరం 3.4, గాండ్లపెంట 2.8, కనగానపల్లి 2.2, ముదిగుబ్బ 2.2, ఎన్‌పీకుంట మండలంలో 2 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాకు మరో రెండు రోజులు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తాజా వర్షాలు ముంగారు పంటలకు మేలు చేస్తాయని వెల్లడించారు.
జగన్‌పై కేసు అక్రమం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్
పెనుకొండ రూరల్: సత్తెనపల్లిలో ఘటనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కేసు నమోదు చేయడం అక్రమమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రమాదవశాత్తూ సింగయ్య మృతి చెందడం బాధాకరమన్నారు. అందుకు ప్రభుత్వము, పోలీసులే బాధ్యత వహించాలన్నారు. జెడ్‌ప్లస్ భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనకు గట్టి బందోబస్తుతో పాటు రోప్ పార్టీతో భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అందువల్లే దుర్ఘటన చోటు చేసుకుందన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఓ రాజకీయ నాయకుడి పర్యటనపై ఆంక్షలు విధించలేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో ఎక్కడా చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాన్‌ల పర్యటనలను అడ్డుకోలేదని, పైగా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రత కల్పించామన్నారు.
జగన్ పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడం చట్ట విరుద్ధం
● వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు మాలగుండ్ల శంకరనారాయణ
సాక్షి, పుట్టపర్తి: రెంటపాళ్లలో ఓ వ్యక్తి మృతి చెందిన కేసుకు సంబంధించి మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి మాలగుండ్ల శంకర్‌నారాయణ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. చట్టం.. ఎవరి చుట్టం కాదని, రాజకీయాల్లో అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని చట్టాలను దుర్వినియోగం చేయకూడదన్నారు. కూటమి నేతలు అధికారాన్ని అడ్డు పెట్టుకుని పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదం జరిగితే.. డ్రైవర్ కారణం అవుతాడు.. కానీ బస్సులోని ప్రయాణికులు కాదని తెలుసుకోవాలన్నారు. ప్రమాదం ఎలా జరిగిందో? ఎవరు చేశారనే దానిపై స్పష్టత వచ్చాకే కేసులో పేర్లను చేర్చాలన్నారు. అలా కాకుండా అధికారం ఉంది..ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే న్యాయస్థానాలు ఊరుకోబోవని గుర్తుంచుకోవాలన్నారు.
27న ‘దిశ’ కమిటీ సమావేశం
అనంతపురం సిటీ: శ్రీసత్యసాయి జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ(దిశ) కమిటీ సమావేశం ఈ నెల 27న పుట్టపర్తిలోని కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు జెడ్పీ డిప్యూటీ సీఈఓ జి.వెంకటసుబ్బయ్య సోమవారం తెలిపారు. దిశ కమిటీ చైర్మన్, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి అధ్యక్షతన ఆ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో మంత్రులు, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, కలెక్టర్ టీఎస్ చేతన్, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కమిటీ సభ్యులు హాజరు కానున్నట్లు వివరించారు. అన్ని శాఖల అధికారులు సమగ్ర సమాచారంతో సమావేశానికి కచ్చితంగా హాజరు కావాలని ఆదేశించారు.

24 మండలాల్లో వర్షం

24 మండలాల్లో వర్షం