
అర్జీలకు మెరుగైన పరిష్కారం చూపాలి
ప్రశాంతి నిలయం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అందే అర్జీలకు మెరుగైన పరిష్కారం చూపాలని డీఆర్‌ఓ విజయ సారథి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పింఛన్లు, ఇంటి స్థలాలు, ఇంటి పట్టాలు, భూ సమస్యలు, సంక్షేమ పథకాల వర్తింపు తదితర వాటిపై మొత్తంగా 212 అర్జీలు అందాయి. కార్యక్రమం అనంతరం డీఆర్‌ఓ విజయసారథి మాట్లాడుతూ... కలెక్టరేట్‌కు వెళ్లి అర్జీ ఇస్తే సమస్యలు పరిష్కారమవుతాయన్న నమ్మకంతో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడి వరకూ వస్తారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తే సమస్యకు మెరుగైన వరిష్కారం చూపవచ్చన్నారు. ఆ దిశగా ప్రతి అధికారీ కృషి చేయాలన్నారు. అలాగే పెండింగ్ అర్జీల పరిష్కారంపై ఆయా శాఖల అధికారులు దృష్టి సారించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారంపై ప్రతి వారం సమీక్ష నిర్వహించాలన్నారు. అర్జీదారుడి సమస్య తీర్చడంలో ఏదైనా సమస్య ఉంటే ఆ విషయం అర్థమయ్యేలా వివరించాలన్నారు. అర్జీల పరిష్కారంలో ఏ స్థాయిలోనూ నిర్లక్ష్యం పనికి రాదన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్దక శాఖల జేడీలు సుబ్బారావు, చంద్రశేఖర్ రెడ్డి, శుభదాస్, ప్రజా రవాణా అధికారి మధుసూదన్, డీఎంహెచ్‌ఓ ఫైరోజా బేగం, డీపీఓ సమత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అధికారులకు
డీఆర్‌ఓ విజయ సారథి ఆదేశం
వివిధ సమస్యలపై 212 అర్జీలు