నిజాయితీ చాటుకున్న ప్రైవేట్‌ టీచర్‌ | - | Sakshi
Sakshi News home page

నిజాయితీ చాటుకున్న ప్రైవేట్‌ టీచర్‌

Jun 23 2025 6:59 AM | Updated on Jun 23 2025 6:59 AM

నిజాయ

నిజాయితీ చాటుకున్న ప్రైవేట్‌ టీచర్‌

కదిరి టౌన్‌: రోడ్డుపై తనకు లభించిన విలువైన బంగారు నగను పోలీసుల ద్వారా సంబంధీకుడికి చేర్చి ఓ ప్రైవేట్‌ టీచర్‌ తన నిజాయితీ చాటుకున్నారు. వివరాలు... కదిరిలోని బీడీ పరిశ్రమలో అకౌంటెంట్‌ పనిచేస్తున్న ఇజ్రాయేల్‌ శుక్రవారం సాయంత్రం వలీ సాహెబ్‌ రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా చేతి బ్యాగ్‌ జారి పోయింది. విషయాన్ని ఆయన గుర్తించలేక అలాగే ముందుకు దూసుకెళ్లిపోయాడు. అయితే అదే సమయంలో అటుగా వచ్చిన ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో పనిచేస్తున్న టీచర్‌ విజయలక్ష్మి... రోడ్డుపై పడిన బ్యాగ్‌ను గుర్తించి తీసుకుని పరిశీలించారు. అందులో బంగారు గొలుసు ఉండడంతో వెంటనే తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. బ్యాగ్‌లోని బంగారు గొలుసు విలువ రూ.4 లక్షలు ఉంటుందని అంచనా వేసిన పోలీసులు విషయాన్ని వెంటనే డీఎస్పీ శివనారాయణస్వామి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చొరవ తీసుకుని విచారణ అనంతరం ఆ బ్యాగ్‌ పొగొట్టుకున్న ఇజ్రాయేల్‌ను ఆదివారం తన కార్యాలయానికి రప్పించుకుని విజయలక్ష్మి చేతుల మీదుగా ఇప్పించారు. నిజాయితీ చాటుకున్న విజయలక్ష్మిని ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు.

జిల్లా అంతటా వర్షం

పుట్టపర్తి అర్బన్‌: తుపాను ప్రభావంతో రెండోరోజు ఆదివారం జిల్లా అంతటా వర్షం కురిసింది. 15 రోజులుగా తుంపరతో సరిపెడుతున్న వరుణ దేవుడు ఆదివారం సాయంత్రం మూడు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మోస్తరు వర్షం కురిపించాడు. రోడ్లపై వర్షం నీరు పారింది. కాలువలు పొంగిపొర్లాయి. ఇక వేరుశనగ విత్తుకోవచ్చని, ఆరుద్ర కార్తె ప్రవేశించిందని, మంచి అదనులో విత్తనం పడుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

స్థల వివాదంలో మరొకరి అరెస్ట్‌

పుట్టపర్తి టౌన్‌: కొత్తచెరువు స్థల వివాదం కేసులో మరొకరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ విజయకుమార్‌ తెలిపారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో కొత్తచెరువు సీఐ మారుతీప్రసాద్‌తో కలసి వివరాలను ఆయన వెల్లడించారు. కొత్తచెరువు నుంచి ధర్మవరానికి వెళ్లే మార్గంలో గత నెల 27న ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీనికి సంబంధించి నమోదైన కేసులో ఇప్పటి వరకూ 11మందిని అరెస్ట్‌ చేశారు. ఇదే కేసులో పరారీలో ఉన్న మెరిమిధశెట్టి పాండును కర్ణాటకలోని కొప్పల్‌ జిల్లా గంగావతి రోడ్డులో అదుపులోకి తీసుకుని కొత్తచెరువుకు తరలించారు. విచారణ అనంతరం అరెస్ట్‌ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. కాగా, నిందితుడు పాండు.. వివిధ రాష్ట్రాలలో 47 కేసుల్లో నిందితుడిగా ఉంటూ ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చాడు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలో వారిని కూడా అరెస్ట్‌ చేయబోతున్నట్లు పోలీసులు తెలిపారు.

మద్యం తాగొద్దన్నందుకు

వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ధర్మవరం అర్బన్‌: భార్య మద్యం తాగొద్దన్నందుకు మనస్థాపానికి గురైన భర్త ఆత్మహత్యకు యత్నించాడు. వివరాలు.. పట్టణంలోని గీతానగర్‌కు చెందిన బేల్దారి పనిచేసే ఏడుకొండలు మద్యం తాగే అలవాటు ఉంది. తాగుడు మానేయాలని భార్య పావని చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈక్రమంలో ఆదివారం సాయంత్రం శ్మశాన వాటిక వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనస్థలానికి చేరుకుని అతడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నిజాయితీ చాటుకున్న  ప్రైవేట్‌ టీచర్‌ 1
1/2

నిజాయితీ చాటుకున్న ప్రైవేట్‌ టీచర్‌

నిజాయితీ చాటుకున్న  ప్రైవేట్‌ టీచర్‌ 2
2/2

నిజాయితీ చాటుకున్న ప్రైవేట్‌ టీచర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement