
మారమన్నందుకు మట్టుబెట్టాడు!
కనగానపల్లి: వ్యసనాలు మాని కుటుంబపోషణపై దృష్టి సారించాలని హితవు పలికినందుకు కట్టుకునే భార్యనే ఓ కసాయి కడతేర్చిన ఘటన కనగానపల్లి మండలంలో సంచలనం రేకెత్తించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు... మండల కేంద్రం కనగానపల్లికి చెందిన బోయ రాఘవ, కళావతి (32) దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో ఏడాదిగా రాఘవ మద్యానికి బానిసగా మారి ఇతర వ్యసనాలనూ అలవర్చుకున్నాడు. దీంతో తరచూ ఇద్దరి మధ్య గొడవలు చోటుచేసుకునేవి.
కట్టెల కోసమని వెళ్లి...
శనివారం సాయంత్రం కట్టెల కోసమని గ్రామ శివారులోని ముళ్ల పొదల్లోకి కళావతితో పాటు రాఘవ వెళ్లాడు. ఆ సమయంలో వ్యసనాలు మానుకోవాలని మరోసారి రాఘవకు భార్య హితవు పలికింది. దీంతో ఆమెతో వాగ్వాదానికి దిగి కొడవలితో దాడి చేశాడు. కుప్పకూలిన భార్య తలపై కట్టెతో బాదడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమెను అక్కడే వదిలేసి ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత ఆమె ప్రాణాలు వదిలింది.
మొదట మిస్సింగ్ కింద ఫిర్యాదు
చీకటి పడుతున్నా కుమార్తె ఇంటికి రాకపోవడంతో కళావతి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కుటుంబ సభ్యులతో కలసి ఆమె కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఆ సమయంలో వారితో పాటు రాఘవ కూడా ఉన్నాడు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా కళావతి కోసం గాలింపు చేపట్టారు. మధ్యాహ్నం గ్రామ సమీపంలోని ముళ్ల పొదల వైపుగా వెళ్లిన స్థానికులు అక్కడ మృతదేహాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు చేరుకుని పరిశీలించారు. కళావతి మృతదేహంగా గుర్తించి కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు అక్కడకు చేరుకుని నిర్ధారించారు. విషయం తెలుసుకున్న రామగిరి సీఐ శ్రీధర్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. రాఘవ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులో తీసుకుని విచారణ చేయడంతో తానే హతమార్చినట్లు అంగీకరించినట్లు సమాచారం.
కుటుంబ కలహాల నేపథ్యంలో
భార్యను కొట్టి చంపిన భర్త
తొలుత మిస్సింగ్ కింద పోలీసులకు ఫిర్యాదు
ముళ్లపొదల్లో లభ్యమైన మృతదేహం

మారమన్నందుకు మట్టుబెట్టాడు!