
పశుమాంసం పట్టివేత
హిందూపురం: కర్ణాటకకు వాహనాల్లో తరలిస్తున్న పశు మాంసాన్ని హిందూపురం రూరల్ సీఐ ఆంజనేయులు దాడిచేసి పట్టుకున్నారు. హిందూపురం ప్రాంతంలో పశువుల(ఎద్దులు, ఆవుదూడలు)ను వధించి మాంసాన్ని గోనె, ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేసి బెంగళూరుకు రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంపై సమాచారం అందడంతో రూరల్ పోలీసులు నిఘా పెట్టారు. ఆదివారం తెల్లవారుజామున ఆరు 406 వాహనాల్లో ఆరు టన్నుల పశు మాంసాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. డ్రైవర్లను అరెస్టు చేసి, వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన మాంసాన్ని పరీక్షలు చేసిన తర్వాత కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. మాంసం వ్యాపారులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు.
కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
కనగానపల్లి: మండలంలోని కుర్లపల్లి గ్రామంలో ఆదివారం టీడీపీ కార్యకర్తల మధ్యన ఘర్షణ చోటు చేసుకుని ఒకరినొకరు కొట్టుకున్నారు. స్థానికులు తెలిపిన మేరకు.. టీడీపీ కార్యకర్త శంకర్ గ్రామంలోని ఆలయం వద్ద ఆదివారం మద్యం సేవిస్తుండగా అటుగా వెళ్తున్న మరో టీడీపీ కార్యకర్త శ్రీకాంత్‌రెడ్డి గమనించి పక్కకు వెళ్లి తాగాలని హితవు పలికాడు. ఆ సమయంలో శ్రీకాంత్‌రెడ్డితో శంకర్ వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి కొట్టుకున్నారు. అనంతరం ఇద్దరూ కనగానపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదుల మేరకు ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.