
యువత పోరును విజయవంతం చేయండి
పుట్టపర్తి: యువతకు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం... ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నిరుద్యోగికీ నెలకు రూ.3 వేల భృతి అందిస్తాం.. అంటూ గత సార్వత్రిక ఎన్నికల్లో యువతను మభ్యపెట్టిన చంద్రబాబు అండ్ కో.. నేడు ఆ ఊసే ఎత్తడం లేదు. పథకాలకు పేర్లు మార్చారే కానీ అమలు మాత్రం చేయడం లేదు. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలనూ తొలగించి రోడ్డుపాలు చేస్తున్నారు. మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకుండా పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నారు. ఇంటికి దూరంగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయంతో హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులకు ‘వసతి దీవెన’ అందించకపోవడంతో అప్పు భారం పడి ఆందోళన చెందుతున్నారు.
ఫీజు కడితేనే సర్టిఫికెట్లు..
చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఉన్నత విద్య, ఉద్యోగాల సమయంలో సర్టిఫికెట్లు తప్పనిసరి కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారి తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ కాలేజీలకు ఫీజులు చెల్లిస్తున్నారు. వాస్తవానికి గడిచిన విద్యా సంవత్సరంలో చివరి రెండు త్రైమాసికాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన జూన్ నెలలో చెల్లించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మళ్లీ వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చి ఉంటే నిధులు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లోకి జమయ్యేవి. కానీ, కూటమి అధికారంలోకి వచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన ఖర్చులను నిలిపివేసింది.
పాత బకాయిలు విడుదల చేసిన ఘనత జగన్‌దే..
పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ వసతి దీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేశారు. ప్రతి త్రైమాసికానికి ముందే షెడ్యూల్ ప్రకటించి నిధులు విడుదల చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఖాతాల్లోకి ఫీజు మొత్తాన్ని జమ చేసే విధానాన్ని తెచ్చారు. పైగా రాజకీయాలకు అతీతంగా 2017–19 మధ్య టీడీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను సైతం జగన్ ప్రభుత్వం చెల్లించడం గమనార్హం.
గతమెంతో ఘనం..
యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలిసారి ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే దక్కింది. జిల్లాలో 18 వేల సచివాలయ ఉద్యోగాలు, ప్రభుత్వ శాఖల్లో 8 వేల ఉద్యోగాల భర్తీతో పాటు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి ఊరట కల్పించారు.
యువతకు చంద్రబాబు అండ్ కో మోసం
నిరుద్యోగులను పట్టించుకోని ప్రభుత్వం
గత ప్రభుత్వం తొలి రెండేళ్లలో ఏకంగా 5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే.. ప్రస్తుత కూటమి సర్కార్ ఏడాది దాటినా ఇప్పటి దాకా ఒక్క ఉద్యోగమూ భర్తీ చేయలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు ఆ దిశగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అసలు నిరుద్యోగుల గురించే పట్టించుకోవడం లేదు.
– అనిల్, నిరుద్యోగి, బుక్కపట్నం
ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు,
జాబ్ క్యాలెండర్ హామీ హుళక్కి
కానరాని ‘ప్రతి నిరుద్యోగికీ
నెలకు రూ. 3 వేల భృతి’
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించని వైనం
ఉన్నత విద్యకు దూరమవుతున్న పేద విద్యార్థులు
‘కూటమి’ కపటత్వాన్ని నిరసిస్తూ
నేడు వైఎస్సార్‌సీపీ ‘యువత పోరు’
నిరుద్యోగ భృతి ఇవ్వాలి
ప్రతి నిరుద్యోగికి రూ.3 వేల భృతి అందించాలి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయినా ఇంత వరకు ఆ ప్రస్తావనే లేదు. ఇప్పటికై నా బకాయిలతో సహా భృతి చెల్లించాలి. త్వరితగతిన ఉద్యోగాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలి.
– పురుషోత్తం, జిల్లా అధ్యక్షుడు,
వైఎస్సార్ విద్యార్థి విభాగం
ఇబ్బందిగా ఉంది
నేను బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నా. ఇప్పటి దాకా ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్ము రూ.10 వేలు మాత్రమే విడుదల చేశారు. ఇంకా చాలా రావాల్సి ఉంది. ఇక వసతి దీవెన సొమ్ము రూ.20 వేలు ఇప్పటికీ జమ కాలేదు. చాలా ఇబ్బందిగా ఉంది.
– ఈశ్వన్, కొత్తచెరువు
సోమందేపల్లి: ‘యువత పోరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ పిలుపునిచ్చారు. ఆదివారం సోమందేపల్లిలో ‘యువత పోరు’ పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించే కార్యక్రమానికి యువత, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, అంతవరకూ నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు నేడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. మరోవైపు ఫీజురీయింబర్స్‌మెంట్– ఉపకార వేతనాలు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. యువత పోరు కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని మేల్కొల్పుతామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌లు గజేంద్ర, శ్రీనివాసులు, జెడ్పీటీసీ అశోక్, వైస్ ఎంపీపీ వెంకట నారాయణరెడ్డి, సర్పంచ్ అంజినాయక్, నాయకులు ఆదినారాయణరెడ్డి, కంబాలప్ప, మంజు, ఈశ్వర్, జితేంద్రరెడ్డి, శ్రీరాములు రమేష్, కళ్యాణ్, ఇమామ్ వలి, ప్రతాప్‌రెడ్డి, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

యువత పోరును విజయవంతం చేయండి

యువత పోరును విజయవంతం చేయండి