
బాలింతలతో ‘వసూళ్లు’
అనంతపురం మెడికల్: ప్రభుత్వాస్పత్రిలో ప్రసవమైన వారికి ఆర్థికసాయం ఇప్పిస్తామని అగంతకులు బాలింతల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి శనివారం వెలుగు చూసింది. అనంతపురం నగర శివారులోని ఆలమూరు రోడ్డులో ఉంటున్న కౌసర్ ఇటీవల ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చేరింది. ఈ నెల 17న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మరుసటి రోజు వీరికి ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. ఆమె ఆధార్, కుటుంబ వివరాలు తెలియజేసి.. రూ.1000 ఇస్తే, ఎన్టీఆర్ వైద్య సేవ కింద డబ్బులు మంజూరు చేయిస్తామని చెప్పాడు. దీంతో కౌసర్ నిజమని నమ్మి గూగుల్ పే నుంచి రూ.వెయ్యి పంపారు. అనంతరం డబ్బు వసూలు గురించి డేటా ఎంట్రీ ఆపరేటర్ల దృష్టికి వెళ్లడంతో వారు సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాంకు ఫిర్యాదు చేశారు. ఇది ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చేసిన పని అని ఆస్పత్రి వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. అయితే సదరు అపరిచిత వ్యక్తికి తిరిగి ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోవడం లేదని తెలిసింది. ప్రభుత్వం నుంచి అందే ఆర్థికసాయం తదితర సేవల గురించి అవగాహన కల్పించడంలో వైద్యులు, అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే ఇలాంటి ఘట నలు చోటు చేసుకుంటున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.