
అక్రమ కేసులకు భయపడకండి
కదిరి టౌన్: ‘‘కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా బనాయించే అక్రమ కేసులకు ఎవరూ భయపడాల్సిన పనిలేదు. ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుంది. కూటమి సర్కార్ వైఫల్యాలను ఎండగట్టండి..ప్రజలను చైతన్యవంతులను చేయండి..మళ్లీ వైఎస్ జగన్ సారథ్యంలో సంక్షేమ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటయ్యేందుకు కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయండి’’ అని వైఎస్సార్ సీపీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకుడు రమేష్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు షేక్ బాబ్జాన్ అధ్యక్షతన జరిగిన టౌన్, మండల కమిటీల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ...కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు పోలీసులను వాడుకుంటున్నారన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారన్నారు. అయినా ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు.
జగనన్నను మరోసారి సీఎంను చేసుకుందాం..
కార్యకర్తలంతా సమష్టిగా పనిచేసి మండల, గ్రామస్థాయిలో వైఎస్సార్ సీపీని మరింత బలోపేతం చేయాలని వైఎస్సార్ సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ అహ్మద్ పిలుపునిచ్చారు. తాను నిరంతరం అందుబాటులో ఉంటానని, ఎవరికి ఏ అవసరమున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. అక్రమ కేసులతో వేధించే వారిని న్యాయస్థానం ఎదుట నిలబెట్టి తప్పక శిక్ష పడేలా చేస్తామన్నారు. వైఎస్ జగనన్నతోనే సంక్షేమ రాజ్యం సాధ్యమని, అందువల్లే ఆయన్ను రెండోసారి సీఎంగా చేసుకునేందుకు కార్యకర్తలంతా సైనికుల్లా పని చేయాలన్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి ప్రణీత్‌రెడ్డి మాట్లాడారు.
23న యువత పోరు..
యువత భవిష్యత్‌ను అంధకారం చేసిన కూటమి సర్కార్ తీరును నిరసిస్తూ ఈనెల 23వ తేదీన వైఎస్సార్ సీపీ ‘యువత పోరు’ కార్యక్రమం నిర్వహిస్తోందని రమేష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగులతో కలిసి అన్ని కలెక్టరేట్‌ల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం యువత పోరు పోస్లర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ తోట అమర్‌నాథ్‌రెడ్డి, మండల కన్వీనర్లు మణికంఠ నాయక్, రవికుమార్‌రెడ్డి, రవీంద్రారెడ్డి, రంగారెడ్డి, ఫయాజ్, అశోక్‌కుమార్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుంది
వైఎస్సార్ సీపీ ‘పురం’ పార్లమెంట్ పరిశీలకుడు
రమేష్‌కుమార్‌రెడ్డి
జగనన్నతోనే సంక్షేమ రాజ్యం: బీఎస్ మక్బూల్

అక్రమ కేసులకు భయపడకండి