
పాలనలో ‘కూటమి’ విఫలం
సోమందేపల్లి: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ విమర్శించారు.. శుక్రవారం లక్ష్మీ వేంకటేశ్వర కల్యాణ మంటపంలో 8వ మండల మహాసభ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పథకాల పేరిట గద్దెనెక్కిన చంద్రబాబు.. ఏడాది పూర్తయినా ఉచిత బస్సు, అన్నదాత సుఖీభవ అమలు చేయలేకపోయారన్నారు. ఏడాది తర్వాత అనేక నిబంధనలతో అరకొరగా తల్లికి వందనం నిధులు విదిల్చారన్నారు. కియాలో రూ.కోట్ల అక్రమ సంపాదన పొందుతూ టీడీపీ నాయకులు ఆర్థికంగా బలపడుతున్నారని ఆరోపించారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా తమిళనాడు ప్రాంతానికి చెందిన వారికి కియా అనుబంధ పరిశ్రమల్లోకి తీసుకోవడం దారుణమన్నారు. పెత్తనం అంతా వారిదే అయిపోయిందని తెలిపారు. చేనేతలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కాటమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కదిరప్ప, ఉపాధ్యక్షుడు బాలస్వామి, ఏఐటీయుసీ జిల్లా సహాయ కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్