
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
ధర్మవరం అర్బన్: గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు చేసే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ మహేష్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజ్‌బేగం హెచ్చరించారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై శుక్రవారం ధర్మవరంలోని ఆర్డీఓ కార్యాలయంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులతో వారు సమావేశమై మాట్లాడారు. భ్రూణ హత్యలు, లింగ నిర్ధారణ వల్ల ఆడ శిశువుల జననాల రేటు గణనీయంగా పడిపోతోందన్నారు. పీసీ–పీఎన్‌డీటీ యాక్ట్–1994 మేరకు లింగ నిర్ధారణ ప్రోత్సహించిన ఆస్పత్రుల వైద్యులు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు, స్వచ్చంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
ధర్మవరం అర్బన్: స్థానిక బడేసాహెబ్ వీధిలో నివాసముంటున్న కురాకుల కృష్ణమూర్తి ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబసభ్యులతో కలసి మూడు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కృష్ణమూర్తి మరో ఊరికి వెళ్లారు. శుక్రవారం తిరిగి వచ్చారు. అప్పటికే ఇంటికి వేసిన తాళం బద్ధలుగొట్టి బీరువాలోని మూడు తులాల బంగారు మాంగల్యం గొలుసు, రూ.2వేలు నగదు, ఇంటి బయట నిలిపిన ద్విచక్రవాహనం అపహరించుకెళ్లినట్లు గుర్తించి సమాచారం ఇవ్వడంతో వన్‌టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఎస్సీ మహిళలకు
ఉచిత టైలరింగ్ శిక్షణ
హిందూపురం: స్థానిక నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్, స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో ముక్కిడిపేటలోని పాత ప్రభుత్వ హాస్టల్ భవనంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు కుటుపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లా ఎన్‌ఏసీ అసిస్టెంట్ డైరెక్టర్ గోవిందరాజులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు నెలల కాల వ్యవధి ఉన్న ఈ శిక్షణకు 16 నుంచి 40 ఏళ్లు కలిగిన మహిళలు అర్హులు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రముఖ గార్మెంట్స్ పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పిస్తారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 23వ తేదీ లోపు ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, రెండు ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు 90529 01657లో సంప్రదించవచ్చు.