
కంటిపాప కోసం.. కన్నతండ్రి శోకం
సోమందేపల్లి: ఇంటి సమీపంలో ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారి షాఫియా అదృశ్యమై నెలలు గడిచినా.. నేటికీ ఆచూకీ కనిపించలేదు. కొద్దిరోజులు ముమ్మరంగా సాగిన పోలీసుల దర్యాప్తు ఆ తర్వాత ఆగిపోయింది. దీంతో నిరుపేద తండ్రి తన కంటిపాప కోసం కన్నీరుమున్నీరవుతున్నాడు.
ఆడుకుంటూ అదృశ్యం..
పెనుకొండ దర్గాపేటకు చెందిన ఖలీల్.. హోటల్ నడుపుతూ జీవనం సాగించేవాడు. ఆయనకు నలుగురు కుమార్తెలు కాగా, వారిలో ఆరేళ్ల వయస్సున్న చిన్న కుమార్తె షాఫియా 2023 జూన్ 12న ఇంటి సమీపంలో ఆడుకుంటూ అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో ఖలీల్ తన బిడ్డ ఆచూకీ కనిపెట్టాలని స్థానిక పోలీస్ స్టేషన్‌తో పాటు ఎస్పీ కార్యాలయానికి కూడా వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా తొలుత ఇతర రాష్ట్రాలకు వెళ్లి మరీ పాప ఆచూకీ కోసం గాలించారు. ఫలితం లేకపోవడంతో ఓ మహిళ ఏఎస్‌ఐకి కేసు అప్పజెప్పి చేతులు దులుపుకున్నారు.
అనుమానితులను ప్రశ్నించని పోలీసులు..
షాఫియా అదృశ్యం వెనుక ఆ చిన్నారి తల్లి సోదరి భర్త బాబ్జాన్ ప్రమేయం ఉన్నట్లు అందరూ అనుమానిస్తున్నారు. ఎందుకంటే షాఫియా అదృశ్యమైన ఘటనకు ఆరు నెలల క్రితం అతను తన బిడ్డను దర్గాపేటకు చెందిన ఓ మహిళ ప్రమేయంతో అమ్మినట్లు ఇటీవల బహిరంగంగా ఒప్పుకున్నాడు. షాఫియాను ఎత్తుకొస్తే అమ్మివేద్దామని సదరు మహిళ కోరినా... తాను ఒప్పకోలేదని అతను చెప్పాడు. అయితే బాబ్జాన్‌తో పాటు అతను చెబుతున్న మహిళనూ పోలీసులు విచారిస్తే.. తమ పాప ఆచూకీ లభిస్తుందని షాఫియా తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇటీవల ఎస్పీ రత్న పాత కేసుల దర్యాప్తు ముమ్మరం చేసి విచారణ పూర్తి చేస్తున్నారని, ఈ క్రమంలోనే తన బిడ్డ అదృశ్యమైన కేసునూ ఓ సారి పరిశీలించి ఆచూకీ కనుగొనాలని ఖలీల్ కోరుతున్నారు.
షాఫియా ఆచూకీ దొరికేనా?
ఓ వ్యక్తి, మరో మహిళ ప్రమేయంపై అనుమానాలు
పట్టించుకోని పోలీసులు..
కేసులో కనిపించని పురోగతి