
రామగిరి వాసికి అంతర్జాతీయ గుర్తింపు
రామగిరి: మండలంలోని గరిమేకలపల్లికి చెందిన నాగశేషుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు దక్కింది. 2024కు సంబంధించి జరిగిన నవలల పోటీల్లో ఆయన రచించిన ‘కిలారి’ ఉత్తమ నవలగా ఎంపిక కావడంతో త్వరలో అమెరికాలోని డల్లాస్‌లో నగదుతో పాటు జ్ఞాపికను అందుకోనున్నారు. కాగా, నాగశేషు కర్ణాటకలోని మైసూరులో ఉన్న ముక్త గంగోత్రి యూనివర్సిటీలో అధ్యాపకుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కంబళ్ల నేత కార్మికుల కష్టాలపై ‘ఏకుదారం’ పేరుతో మొట్టమొదటి సారిగా ఆయన రచించిన నవల బహుళ ప్రాచూర్యం పొందింది. అనంతరం కురుబల ఆరాధ్యదైవం బీరప్ప స్వామి లీలలపై ఓ పుస్తకాన్ని రచించారు. తన ‘కిలారి’ నవలలో కులాల కంటే మానవత్వం ముఖ్యమనే సందేశాన్ని అందజేశారు. ఏటా జరిగే జొన్నలగడ్డ రాంబొట్లు – సరోజమ్మ స్మారక సిరికోన నవలా రచనల పోటీలకు సంబంధించి 2024లో నిర్వహించిన పోటీలకు పరిశీలనార్థం ‘కిలారి’ నవలను ఆన్‌లైన్ ద్వారా సిరికోన సాహితీ అకాడమికి నాగశేషు పంపారు. ప్రాథమిక పరిశీలన తర్వాత మొత్తం 26 నవలలను ఎంపిక చేసి న్యాయనిర్ణేతకు నిర్వాహకులు అందజేశారు. రెండోసారి వడబోత తర్వాత పోటీలో నిలిచిన 6 నవలలను ముగ్గురు న్యాయనిర్ణేతలకు పంపారు. ఇందులో కథావస్తువు, నిర్మాణం, తార్కిరత, శైలి, శిల్పం, సామాజిక ప్రయోజనం అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉత్తమ నవలగా ‘కిలారి’ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నాగశేషు మాట్లాడుతూ.. త్వరలో అమెరికా వేదికగా పురస్కారాన్ని అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.