
రాష్ట్రంలో అరాచక పాలన
చిలమత్తూరు: ‘రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది. మహిళలు, బాలికలకు రక్షణలేకుండా పోయింది. పట్టించుకునే వారే లేకపోవడంతో రోజుకో చోట బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి’’ అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల ధ్వజమెత్తారు. శుక్రవారం హిందూపురంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక నిర్వహించిన ‘పదవులకు పట్టాభిషేకం’ కార్యక్రమానికి శ్యామల, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్, పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు రమేష్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గవ్యాప్తంగా పార్టీ పదవులు పొందిన నేతలను సన్మానించారు. అనంతరం జరిగిన సభలో ఆరె శ్యామల మాట్లాడారు. 40 ఏళ్ల అనుభవమంటూ గొప్పలు చెప్పే చంద్రబాబు ఏడాది పాలన అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు. ఏడాదిలోనే రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా చేశారన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళాభ్యుదయానికి పాటుపడ్డారని, నేడు మహిళలు ఇంట్లోంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు తెచ్చారన్నారు. ఏడాది పాలనలో ప్రజలకు ఏమీ చేయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్... చేయని సంక్షేమం, అభివృద్ధిపై నివేదికలు, సమీక్షలు నిర్వహించడం సిగ్గుచేటన్నారు. ఆయన తమ ఏడాది పాలనలో ఆడపిల్లలపై జరగుతున్న అఘాయిత్యాలు, హిందూపురంలో మహిళల అత్యాచారం మొదలు, దళిత బాలికపై సామూహిక అత్యాచారం, కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనలపై నివేదికలిస్తే బాగుంటుందన్నారు. సవిత తనస్థాయి తెలుసుకోవాలి..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడుతున్న మంత్రి సవిత.. ముందు తన స్థాయి తెలుసుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ అన్నారు. 1945లో మనదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని చెప్పిన హాఫ్ నాలెడ్జ్ మంత్రి సవిత కూడా రాజకీయాల గురించి మాట్లాడటం చూసి జనమే నవ్వుకుంటున్నారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో లేకపోయినా... ఆడబిడ్డల రక్షణ కోసం రోడ్లెక్కారని, వారికి ఆర్థిక భరోసా కల్పించారన్నారు. చిలమత్తూరు మండలంలో అత్తాకోడలిపై అత్యాచారం జరిగితే ఆ కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందించారని గుర్తుచేశారు. కల్లితండాలో వీరజవాన్ మురళీనాయక్ కుటుంబానికి రూ.25 లక్షలు ఇచ్చి ఆర్థికంగా ఆదుకున్నారన్నారు. కానీ దళిత బాలికపై అత్యాచారం జరిగితే హోంమంత్రిగా ఉన్న అనిత పరామర్శించిన పాపాన పోలేదని విమర్శించారు.
సైనికుల్లా పనిచేయండి..
హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు రమేష్ రెడ్డి, హిందూపురం సమన్వయకర్త టీఎన్ దీపిక మాట్లాడుతూ.. పదవులు పొందిన వారంతా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు సైనికుల్లా పనిచేయాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రతి నాయకుడు, కార్యకర్తకూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌళూరు మధుమతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పురుషోత్తమరెడ్డి, రాష్ట్ర నేత వజ్రభాస్కర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ, వైఎస్సార్ సీపీ కురుబ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్‌ఏ శివ తదితరులు పాల్గొన్నారు.
కూటమి హయాంలో
బాలికలు, మహిళలకు రక్షణ లేదు
చంద్రబాబు ఏడాది పాలన అట్టప్ ప్లాప్
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల

రాష్ట్రంలో అరాచక పాలన