
భూముల సబ్ డివిజన్‌కు స్పెషల్ డ్రైవ్
ప్రశాంతి నిలయం: జాయింట్ పట్టాదారుల భూములను సబ్ డివిజన్ చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. సబ్‌డివిజన్ చేయించుకోవాల్సిన రైతులు ఈనెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జాయింట్ పట్టాదారులుగా నమోదైన రైతుల పేర్లపై భూమి విస్తీర్ణం ఎక్కువగా చూపుతుందని, దీంతో వారంతా ‘అన్నదాత సుఖీభవ’, ‘తల్లికి వందనం’ లాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందలేకపోతున్నారన్నారు. అందువల్లే భూముల సబ్ డివిజన్‌కు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టామన్నారు. సబ్ డివిజన్ చేయించుకోవాల్సిన రైతులు రూ.50 రుసుం గ్రామ సచివాలయంలో చెల్లించి ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
నేడు ‘పురం’లో అంతర్జాతీయ
యోగా దినోత్సవం
ప్రశాంతి నిలయం: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం 6 గంటలకు హిందూపురంలోని ఎంజీఎం మైదానంలో జిల్లా స్థాయి యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు.
రైలు ఢీకొని
33 గొర్రెల మృతి
సోమందేపల్లి: మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి వద్ద రైలు ఢీకొని 33 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... బ్రాహ్మణపల్లికు చెందిన మగ్గం అంజి గొర్రెల కాపరి. శుక్రవారం ఉదయం ఆయన తన గొర్రెలను మేత కోసం ఈదుళబలాపురం గ్రామం వైపు తీసుకువస్తున్నాడు. అయితే బ్రాహ్మణపల్లి రైల్వేగేట్ సమీపంలో గొర్రెలు రైలు పట్టాలు దాటుతుండగా.. విజయవాడ వైపు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ వేగంగా వచ్చి గొర్రెలను ఢీ కొంది. ఈ ఘటనలో 33 గొర్రెలు మృతి చెందాయి. తనకు రూ.4 లక్షల నష్టం వాటిల్లిందని అంజి వాపోయాడు. హిందూపురం రైల్వే పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.