
తుంగభద్రకు పోటెత్తిన వరద
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తింది. బుధవారం 19,265 క్యూసెక్కులు ఉన్న ఇన్‌ఫ్లో గురువారం 43,706, శుక్రవారం సాయంత్రానికి 51,261 క్యూసెక్కులకు పెరిగింది. శనివారం ఉదయానికి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. డ్యాంలో నీరు 40 టీఎంసీలకు చేరువగా చేరింది. తుంగభద్ర జలాశయం ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో డ్యాం ఎగువన నిర్మించిన అప్పర్‌తుంగా ప్రాజెక్ట్ (గాజనూరు జలాశయం) నిండటంతో 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీనికి తోడు రిజర్వాయర్ పరిసరాల్లో ఆశాజనకంగా వర్షాలు కురుస్తుండడంతో ఇన్‌ఫ్లో మరింత పెరుగుతున్నట్లు తుంగభద్ర బోర్డు అధికారులు వెల్లడించారు.
● గతేడాది 33 క్రస్ట్ గేట్లలో 19వ క్రస్ట్ గేటు కొట్టుకుపోవడం, మిగిలిన 32 గేట్లు కూడా దెబ్బతినడం వల్ల నిపుణుల సూచనల మేకు వాటిని మార్చాలని టీబీ బోర్డు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు 105.788 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం ఉన్న జలాశయంలో గేట్ల అంచు వరకు 80 టీఎంసీల నీరును మాత్రమే నిల్వ చేసి కాలువలకు వదులుతారు. ఎక్కువ వరద వస్తే నదికి వదిలేయనున్నారు. ఒక డ్యాంలో నీటి నిల్వ 40 టీఎంసీలకు తగ్గిన తర్వాత కొత్త గేట్లను అమర్చనున్నట్లు సమచారం.
● ప్రసుత్తం తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ 1,633 అడుగులకు గాను 1610.52 అడుగులకు చేరుకుంది. ఇన్‌ఫ్లో 51,261 క్యూసెక్కులు కాగా అవుట్‌ఫ్లో 256గా ఉంది. మొత్తం నీటి సామర్ధ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రసుతం 38.610 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
51,261 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
40 టీఎంసీలకు చేరువగా నీరు