
సేవలతో ప్రజాభిమానం పొందాలి
ప్రశాంతి నిలయం: రెవెన్యూ శాఖలోని ప్రతి ఉద్యోగి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలతో వారి అభిమానం పొందాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన రెవెన్యూ దినోత్సవంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరిపాలనలో రెవెన్యూ శాఖ చాలా కీలకమన్నారు. రెవెన్యూ ఉద్యోగులు బాధ్యతగా పనిచేస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని, తద్వారా ప్రభుత్వానికీ మంచి పేరు వస్తుందన్నారు. రెవెన్యూ ఉద్యోగులంతా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సేవలు వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేసే పథకాల లబ్ధిని ప్రజలకు అందేలా చూడాలన్నారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ మాట్లాడుతూ.. రెవెన్యూ ఉద్యోగులు చిత్తశుద్ధితో సేవలందించి శాఖ ప్రతి ప్రతిష్ట పెంచాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి విజయసారథి మాట్లాడుతూ..రెవెన్యూ ఉద్యోగులు తమ బాధ్యతలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అనంతరం రెవెన్యూ శాఖలో సేవలందించిన విశ్రాంత డిప్యూటీ తహసీల్దార్లు అశోక్ గుప్త, నారాయణ స్వామిని సత్కరించి జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణ రెడ్డి, రామసుబ్బయ్య, ఓఏ వెంకటరానాయణ సిబ్బంది పాల్గోన్నారు.
రెవెన్యూ దినోత్సవంలో కలెక్టర్ టీఎస్ చేతన్