
తహసీల్దార్ షాబుద్ద్దీన్ పలాయనం
పుట్టపర్తి: తహసీల్దార్ షాబుద్దీన్ పలాయనం చిత్తగించారు. ‘బదిలీ తహసీల్దార్ మళ్లీ విధుల్లోకి’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వెంటనే షాబుద్దీన్ బుక్కపట్నం తహసీల్దార్ కార్యాలయం నుంచి జారుకున్నారు. వివరాల్లోకెళితే... బుక్కపట్నం తహసీల్దార్‌గా పనిచేస్తున్న షాబుద్దీన్ ఈ నెల 12న తనకల్లుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇక్కడే డీటీగా ఉన్న నరసింహులుకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు. అయితే రాజకీయ కారణాలతో షాబుద్దీన్ తనకల్లులో జాయిన్ కాలేదు. ఉన్నట్టుండి బుధవారం బుక్కపట్నం తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యక్షమై పనులు చక్కబెట్టారు. అనధికారికంగా ఆయన విధులు నిర్వహిస్తున్న వైనంపై ‘సాక్షి’లో కథనం రావడంతో వెంటనే అక్కడి నుంచి జారుకున్నారు. వారం పది రోజుల్లో ఆయన ఏదో ఒక చోట విధుల్లో చేరాలని, లేకపోతే కలెక్టర్ కార్యాలయానికి అటాచ్ చేస్తారని ఉన్నతాధికారులు తెలిపారు.