
పిల్లల హక్కులకు భంగం కలగరాదు
పుట్టపర్తి అర్బన్: పిల్లల హక్కులకు భంగం కలగకుండా ఉండేందుకు బాల్య వివాహాలును రూపు మాపడంతో పాటు గ్రామాల్లో స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పేలా ప్రత్యేకమైన వ్యవస్థను నిర్మిద్ధామంటూ పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి పిలుపునిచ్చారు. బాలల హక్కుల పరిరక్షణ అంశంపై పుట్టపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో డివిజన్ స్థాయిలోని తహసీల్దార్లు, ఎండీపీఓలు, ఎంఈఓలు, ఎస్‌ఐలు, శక్తి టీం సభ్యులతో గురువారం వారు సమీక్షించారు. అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే పిల్లలపై జరుగుతున్న లైంగికదాడులను అరికట్టేందుకు వీలవుతుందన్నారు. పిల్లల అవసరాలను సున్నితంగా పరిష్కరించేలా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. ఆడ మగ పిల్లల్లో స్నేహ పూర్వక వాతావరణం నెలకొల్పాలన్నారు. గ్రామ బాలల రక్షణ కమిటీలను బలోపేతం చేయడం, ఆన్‌లైన్ దుర్వినియోగాలపై చైతన్య పరచడం వంటి కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు. హాస్టళ్లలో పిల్లల భద్రత, కౌమార దశలో ఉన్న వారికి డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో సీఐఎఫ్ జిల్లా కో ఆర్డినేటర్ కొండప్ప, డీసీపీఓ మహేష్, సోషల్ వర్కర్ ఆనంద్, యూత్ అంబాసిడర్ సంజు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆర్డీఓ సువర్ణ