
నిస్వార్థ సేవకుడు ఫాదర్ ఫెర్రర్
బత్తలపల్లి: కరువు జిల్లాలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిస్వార్థంగా సేవలు అందించి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ప్రజల్లో హృదయాల్లో ఓ దేవుడిగా ముద్ర వేసుకున్నారని పలువురు కొనియాడారు. ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ ఫెర్రర్ 16వ వర్ధంతి సందర్భంగా బత్తలపల్లిలోని ఆయన ఘాట్‌ను సర్వాంగ సుందరంగా అలంకరించారు. సంస్థలో పని చేస్తున్న వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు. జిల్లాలో మూడు అధునాతన ఆస్పత్రులను నిర్మించి అన్ని వర్గాలకు వైద్యసేవలు అందించడం, జిల్లా కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆస్పత్రి ఏర్పాటు, బత్తలపల్లిలో ఎయిడ్స్ రోగులకు ఆస్పత్రి ఏర్పాటు తదితర సేవా కార్యక్రమాలకు సంబంధించిన ఛాయాచిత్రాలను ప్రదర్శించారు. కాగా, సంజీవపురం, సూర్యచంద్రాపురం, డి.చెర్లోపల్లి గ్రామాల్లోని ఫాదర్ ఫెర్రర్ విగ్రహాలకు స్థానికులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నేఫెర్రర్ బత్తలపల్లిలోని ఫాదర్ పెర్రర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఘాట్ వద్దకు వచ్చిన పలువురిని ఆప్యాయంగా పలకరించారు. ఆర్డీటీ రీజనల్ డైరెక్టర్ ప్రమీల, మెడికల్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్, మెయిన్‌టెనెన్స్ మేనేజర్ హనుమంతరెడ్డి, సీబీటీ కాటమయ్యతో పాటు ఆస్పత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.