
బ్యాంకు ఉద్యోగి దుర్మరణం
శెట్టూరు: ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో మరో బైక్‌పై వెళుతున్న బ్యాంక్ ఉద్యోగి దుర్మరణం పాలయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన పార్థసారథి (53) శెట్టూరు మండలం ములకలేడులోని యూనియన్ బ్యాంక్ శాఖలో క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. కళ్యాణదుర్గంలో నివాసముంటూ రోజూ ద్విచక్రవాహనంపై విధులకు వెళ్లి వచ్చేవారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు కళ్యాణదుర్గం నుంచి తన ద్విచక్రవాహనంలో ములకలేడుకు బయలుదేరారు. శెట్టూరు మండలం అడవిగొల్లపల్లి – యాటకట్లు గ్రామాల మధ్య ప్రయాణిస్తుండగా మలుపులో ఎదురుగా ద్విచక్ర వాహనంపై వేగంగా వచ్చిన కనుకూరు గ్రామానికి చెందిన సత్యప్ప ఢీకొన్నాడు. ఘటనలో రోడ్డుపై పడిన పార్థసారథి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సత్యప్పతో పాటు ఆయన కుమార్తెకూ తీవ్ర గాయాలయ్యాయి. ఆ మార్గంలో వెళుతున్న వారు గుర్తించి క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పార్థసారథి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.