
రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ
ప్రశాంతి నిలయం: జిల్లాలో 2024–25 సంవత్సరానికి గాను వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీకి సంబంధించి రూ.1.72 కోట్ల రాయితీ చెక్కును అర్హులైన 1,021 మంది రైతులకు కలెక్టర్ టీఎస్ చేతన్ బుధవారం అందజేశారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. రోటవేటర్లు, బ్రష్‌కట్లర్లు, స్ప్రేయర్లు, మతుకలు, నూర్పిడి యంత్రాలు వంటివి రైతులకు ఆర్‌ఎస్‌కేల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎఫ్‌పీఓ ప్రతినిధులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ఎప్‌పీఓలు చేపడుతున్న రైతు సంబంధిత కార్యక్రమాలు, సమస్యలపై ఆరా తీశారు. రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై ఎఫ్‌పీఓలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వైవీ సుబ్బారావు, జిల్లా ఉద్యాన అధికారి చంద్రశేఖర్, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.
ప్రాణాలు బలిగొన్న అతివేగం
తనకల్లు: అతి వేగం ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు.. తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లికి చెందిన పుప్పాల కిరణ్‌కుమార్ (23) జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. వ్యక్తిగత పనిపై బుధవారం కొక్కంటిక్రాస్‌కు వచ్చాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. నల్లగుట్లపల్లి సమీపంలో 42వ జాతీయ రహదారిపై అతివేగంగా వెళుతూ నియంత్రణ కోల్పోవడంతో ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొంది. ప్రమాదంలో కిందపడిన కిరణ్‌కుమార్ తలకు బలమైన గాయం కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న వందేమాతరం టీం సభ్యులు తమ ఉచిత అంబులెన్స్‌లో కిరణ్‌కుమార్‌ను తనకల్లులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.