
ఎద్దుల పోటీలు ప్రారంభం
ముదిగుబ్బ: మండల పరిధిలోని నాగారెడ్డిపల్లిలో శనివారం శ్రీరాముల ఉత్సవాల్లో భాగంగా ఎద్దుల పోటీలను మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. కాసేపు అక్కడే ఉండి పోటీలను తిలకించారు. ఆ తర్వాత ముదిగుబ్బ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ గ్రామీణ మహిళల ఆర్థిక స్వాలంభన కోసం ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ముదిగుబ్బ మండలానికి 500 కుట్టు మిషన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.
హైపర్ టెన్షన్‌తో జాగ్రత్త
పుట్టపర్తి అర్బన్: హైపర్ టెన్షన్‌తో ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం వరల్డ్ హైపర్ టెన్షన్ డేని పురస్కరించుకొని జిల్లా వైద్యాధికారులు ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. శ్రీనివాసులు మాట్లాడుతూ ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో ఒత్తిడులు, నిద్రలేమి, జంక్ ఫుడ్, జన్యుపరమైన కారణాలతో జీవన విధానంలో మార్పులు వచ్చాయన్నారు. హైబీపీతో ఒక్కోసారి రక్తనాళాలు చిట్లిపోయే ప్రమాదం ఉందన్నారు. వైద్యారోగ్యశాఖ 2023లో నిర్వహించిన సర్వేలో జిల్లాలో 64,471 మంది బీపీ బారిన పడినట్లు తేలిందన్నారు. అదే 2024లో స్క్రీనింగ్ చేయగా 1.05 లక్షల మంది ఉన్నట్లు నిర్ధారించారన్నారు. నిద్రలేమి, అధిక ఉప్పు, శారీరక శ్రమ లేకున్నా, ఊబకాయ సమస్యలతో బీపీ వస్తోందన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే బీపీని నియంత్రణలో ఉంచుకోవచ్చన్నారు.
యర్రగుంటపల్లిలో చోరీ
నల్లచెరువు: మండల పరిధిలోని యర్రగుంటపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. బాధితుల వివరాలమేరకు.. యర్రగుంటపల్లికి చెందిన వెంకట మల్లయ్య దంపతులు శుక్రవారం రాత్రి ఇంట్లో భోజనం చేసి నిద్రపోయేందుకు ఇంటిపైకి వెళ్లారు. అయితే అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఎవరూ లేరని గమనించిన దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. గుట్టు చప్పుడు కాకుండా ఏకంగా ఇంట్లోని బీరువాను సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి తీసుకెళ్లి పగలగొట్టి అందులోని రూ.1. 30 లక్షల నగదు, తులం బంగారు అపహరించారు. ఉదయం ఇంట్లో చోరీ జరిగిందని గ్రహించిన బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ మక్బూల్ బాషా పరిశీలించారు. బీరువాపై ఉన్న వేలి ముద్రలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఎద్దుల పోటీలు ప్రారంభం

ఎద్దుల పోటీలు ప్రారంభం