
జిల్లాలో ఐదు పారిశ్రామిక హబ్‌లు
ప్రశాంతి నిలయం: జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం ఐదు పారిశ్రామిక హబ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు అవసరమైన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ‘జిల్లాలో పరిశ్రమల స్థాపన... భూసేకరణ’ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో పారిశ్రామిక వాడల ఏర్పాటుకు 35 వేల ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వీలైనంత త్వరగా భూసేకరణ జరపాలన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు 5 బ్లాక్‌లను గుర్తించాలని, ఆయా మండలాల్లో ఎక్కడ ప్రభుత్వ భూములున్నాయో వాటిని త్వరితగతిన ఏపీఐఐసీకి అప్పగించాలన్నారు. హిందూపురం–లేపాక్షి, చిలమత్తూరు–గోరంట్ల పారిశ్రామిక హబ్‌లతో పాటు మడకశిర హబ్, పెనుకొండ–కియా హబ్, పుట్టపర్తి హబ్‌లు అబివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జాతీయ రహదారి నుంచి 2 కిలోమీటర్లు దూరంలో పంటలు సాగుచేయని 10 నుంచి 15 వేల ఎకరాల డీ పట్టా భూములున్నాయని, వాటిని గుర్తించి పరిశ్రమల స్థాపనకు భూసేకరించాలన్నారు. రామగిరి, కనగానపల్లి మండలాల్లో సోలార్ పార్కుల కోసం భుమిని గుర్తించి నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సోనీ సహాని, ఆర్డీఓలు సువర్ణ, ఆనంద్‌కుమార్, పలువురు తహసీల్దార్లు పాల్గొన్నారు.
పరిశుభ్రత జీవితంలో భాగం కావాలి
కొత్తచెరువు: వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని కలెక్టర్ చేతన్ సూచించారు. శనివారం కొత్తచెరువులో జరిగిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించి ‘స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. బస్టాండులో చలివేంద్రం ప్రారంభించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘బీట్ ద హీట్’ పేరుతో నెల రోజుల పాటు ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
భూసేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశం