
జిల్లాలో భారీ వర్షం
పుట్టపర్తి అర్బన్/చెన్నేకొత్తపల్లి: మండు వేసవిలో వరుణుడు ప్రతాపం చూపాడు. ఖరీఫ్ పంటలకు మేలు జరిగేలా ముందస్తుగా వర్షించి అందరినీ మురిపించాడు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ భానుడి భగభగ మండగా, సాయంత్రం నుంచి వాతావరణంలో ఒక్కసారిగా
మార్పులు చోటుచేసుకున్నాయి. రాత్రి ఉరములు, మెరుపులతో కూడిన వాన కురిసింది. మంగళవారం ఉదయం వరకూ జిల్లాలోని 17 మండలాల పరిధిలో 13 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కొత్తచెరువు మండలంలో 77.6 మి.మీ వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక సీకేపల్లి మండలంలో 74.6 మి.మీ, బుక్కపట్నం 59.4, పుట్టపర్తి 36.2, ధర్మవరం 34.6, నల్లమాడ 24, రామగిరి 23.6, కనగానపల్లి 15.2, కదిరి 15.2, పరిగి 11.6, అగళి 10.2, తలుపుల 7.4, రొళ్ల 7.4, ముదిగుబ్బ 6.8, ఓడీ చెరువు 6.4, పెనుకొండ 2.6, బత్తలపల్లి 1.2, తాడిమర్రి మండలంలో 1.2 మి.మీ మేర వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
చెన్నేకొత్తపల్లిలో పొంగిపొర్లిన
వాగులు, వంకలు..
చెన్నేకొత్తపల్లి మండలంలో సోమవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రెండు గంటల పాటు వాన కుమ్మేయడంతో ఏకంగా 74.06 మి.మీ వర్షపాతం నమోదైంది. దీంతో చెన్నేకొత్తపల్లి నుంచి వెంకటంపల్లికి వెళ్లే దారిలో ఉన్న వంక పారింది. అలాగే మేడాపురం పంచాయతీ పరిధిలోని పెద్దమొగలాయిపల్లి, చిన్నమొగలాయిపల్లి గ్రామాల వద్ద వంకలు పొంగి ప్రవహించాయి. మేడాపురం, నాగసముద్రం తదితర గ్రామాల చెరువులకు నీరు చేరడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆనందంలో మునిగిపోయారు. తాజా వర్షంతో ముంగారు సేద్యానికి రైతులు సిద్ధమవుతుండగా...మూగజీవాలకు మేతతో పాటు అటవీ ప్రాంతంలో తాగునీరు లభిస్తుందని పశువుల కాపరులు చెబుతున్నారు. కాగా, రాగల ఐదు రోజులూ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
17 మండలాల పరిధిలో
13 మి.మీ సగటు వర్షపాతం నమోదు
రాగల ఐదు రోజులూ వర్ష సూచన

జిల్లాలో భారీ వర్షం