
ఆ మూడు స్థానాలకు 19న ఎన్నికలు
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లాలో రెండు ఎంపీపీ, ఒక వైస్ ఎంపీపీ స్థానానికి ఈ నెల 19న మళ్లీ ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 15న నోటిఫికేషన్ ఇచ్చి, 19న ఎన్నిక నిర్వహించేందుకు కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భారీ బందోబస్తు మధ్య ఏర్పాటు చేస్తున్నట్లు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల ఎన్నికల అధికారులు రాజోలి రామచంద్రారెడ్డి, జి.వెంకటసుబ్బయ్య తెలిపారు. కాగా.. గతంలో వివిధ కారణాలతో ఖాళీ ఏర్పడ్డ స్థానిక సంస్థల స్థానాలకు మార్చి 27న ఎన్నికలు నిర్వహించారు. అయితే గాండ్లపెంట, రామగిరి ఎంపీపీ స్థానాలతో పాటు కంబదూరు వైస్ ఎంపీపీ స్థానానికి ఎన్నిక వాయిదా పడింది. ఆయా స్థానాలకు మార్చి 28న మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని అధికారులు చర్యలు తీసుకున్నా.. రాజకీయ కారణాలతో వాయిదా పడ్డాయి.
వైఎస్సార్‌సీపీ నేత షెడ్డుకు నిప్పు
ధర్మవరం రూరల్: మండలంలోని బిల్వంపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు హరిని ఆర్థికంగా దెబ్బ తీసేందుకు ఆయన వ్యవసాయ బావి వద్ద ఉన్న షెడ్డుకు మంగళవారం దుండగులు నిప్పు పెట్టారు. మంగళవారం వైఎస్ జగన్ కల్లితండా పర్యటన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డితో కలసి ఆయన తరలివెళ్లాడు. హరి గ్రామంలో లేడని తెలుసుకున్న దుండగులు పొలంలో ఉన్న షెడ్డుకు నిప్పు పెట్టడంతో అందులో నిల్వ చేసిన వేరుశనగ బస్తాలు, డ్రిప్పు పరికరాలు, స్ప్రింక్లర్ల పైపులు, ఇతర వ్యవసాయ పనిముట్లు కాలిబూడిదయ్యాయి. సమీపంలో ఉన్న రైతులు నుంచి సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసేలోపు రూ.3 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. ఘటనపై ధర్మవరం రూరల్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు.
‘బదిలీల్లో ప్రాధాన్యత కల్పించాలి’
ఓడీచెరువు: ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి కాని ఉపాధ్యాయులను తప్పనిసరి బదిలీ చేయాల్సి వస్తే వారికి ఎనిమిదేళ్ల స్టేషన్ పాయింట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షర్ఫుద్దీన్, జిల్లా అధ్యక్షుడు గౌస్ లాజమ్ డిమాండ్ చేశారు.2017, ఆగస్టులో బదిలీ పొందిన ఉపాధ్యాయులను ఎనిమిదేళ్లు పూర్తి కాకుండానే బదిలీల జాబితాలో చేర్చారన్నారు. అలాంటప్పుడు వారికి ఎనిమిదేళ్ల స్టేషన్ పాయింట్లు కేటాయించాలని కోరారు. అప్పుడే అందరికీ సమన్యాయం జరుగుతుందన్నారు.