
సీనియారిటీ సమస్యను పరిష్కరించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మునిసిపాలిటీ స్కూళ్ల టీచర్ల సీనియార్టీ సమస్యను పరిష్కరించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం డీఈఓ ప్రసాద్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, అనంతపురం, హిందూపురం, కదిరి, ధర్మవరం మునిసిపాలిటీల్లో 2012 డీఎస్సీకి సంబంధించి జాయినింగ్ తేదీని ఒక్కో మునిసిపాలిటీలో ఒక్కో విధంగా నమోదు చేశారని గుర్తు చేశారు. కదిరి మునిసిపాలిటీలో 2013 జనవరి 2గా, తాడిపత్రి మునిసిపాలిటీలో 2012 డిసెంబరు 31గా, ధర్మవరం మునిసిపాలిటీలో 2013 జనవరి 10గా, రాయదుర్గం మునిసిపాలిటీలో 2013 జనవరి 5గా, హిందూపురం మునిసిపాలిటీలో 2013 జనవరి 4గా నమోదు చేశారన్నారు. ఒకే డీఎస్సీ ద్వారా రిక్రూట్ అయినప్పటికీ జాయినింగ్ తేదీలు వేర్వేరుగా ఉండడం వలన సీనియారిటీకి, తర్వాత పొందే పదోన్నతులకు ఇబ్బందిగా మారుతోందన్నారు. సమస్య పరిష్కారానికి వీరందరికీ కామన్ జాయినింగ్ తేదీ 2012, డిసెంబరు 31గా నమోదు చేయాలని కోరారు. డీఈఓను కలిసిన వారిలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, సుధాకర్ ఉన్నారు.