
తపన సాహిత్య వేదిక పురస్కార విజేతల ప్రకటన
హిందూపురం: తపన సాహిత్య వేదిక సేవా పురస్కార విజేతలను ప్రకటించారు. శనివారం హిందూపురంలో తపన సాహిత్య వేదిక సమావేశం జరిగింది. వేదిక నిర్వాహకుడు ప్రముఖ రచయిత సడ్లపల్లి చిదంబరరెడ్డి మాట్లాడుతూ కథా పురస్కారం కోసం 2024వ ఏడాదిలో అచ్చయిన కథా సంపుటాలను ఆహ్వానించినట్లు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల తెలుగు రచయితలు 50కి పైగా కథా సంపుటాలను పంపించారన్నారు. ఇందులో చిత్తూరు జిల్లాకు చెందిన పలమనేరు బాలాజీ రాసిన ‘ఏకలవ్య కాలనీ ఎరుకల జీవన గాథలు’ పుస్తకం రూ.10వేల నగదు పురస్కారానికి ఎంపికై ందన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా స్వర్ణకిలారి రాసిన నల్లబంగారం అనే కథల సంపుటికి రూ.5 వేల ప్రోత్సాహక నగదు పురస్కారానికి ఎంపికై ందన్నారు. న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన సాహితీ విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, పార్వతీ పురం గండేట గౌరునాయుడు, హైదరాబాద్ డాక్టర్ దేవేంద్రలకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఎయిడ్స్‌పై విస్తృత పరిశోధనలు చేసి ప్రజావైద్యుడుగా పేరుపొందిన కాకినాడ డాక్టర్ యనమదల మురళీకృష్ణకు సేవా పురస్కరాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే పురస్కారాలు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక రచయితలు సిద్దగిరి శ్రీనివాస్, ఆంధ్రరత్న గంగాధర్, డాక్టర్ అశ్వత్థ నారాయణ, యువకవి గంగాధర్, విశ్రాంత ప్రిన్సిపాల్ గంగిరెడ్ది, ఎన్.రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.