కదిరి టౌన్: స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దశి (స్వాతి నక్షత్రం) ఆదివారం శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి జయంత్యుత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడి ఒక ప్రకటనలో తెలిపారు. మూలవిరాట్‌కు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం 6.30 గంటలకు శేషవాహనంపై స్వామివారు తిరువీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
బత్తలపల్లి: ఆటో ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముదిగుబ్బ మండలం ఇందుకూరుకు చెందిన బిల్లే సూర్యనారాయణ (52) కుటుంబంతో పాటు ఆదే గ్రామానికి చెందిన తిరుపాల్ ఆటోలో ఇరు కుటుంబ సభ్యులతో కలసి శనివారం ఉదయం ధర్మవరం చెన్నకేశవస్వామి రథోత్సవానికి వెళ్లారు. అక్కడ తేరు ముగించుకుని గిద్దలూరు అక్కమ్మ జాతరకు వెళ్లాలని ఆటోలో బయల్దేరారు.
బత్తలపల్లిలోని తాడిపత్రి రోడ్డు శివాలయం వద్దకు రాగానే మలుపులో వేగం అదుపుకాక ఆటో బోల్తాపడింది. కింద పడిన సూర్యనారాయణపై ఆటో పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి కాసేపటి తర్వాత మృతి చెందాడు. మృతుని భార్య లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.