
13న కల్లితండాకు వైఎస్ జగన్
● వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించనున్న మాజీ సీఎం
రొద్దం: దేశ రక్షణలో అసువులు బాసిన జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అఽధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 13న కల్లితండాకు వస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆమె మండల పరిధిలోని కంబాలపల్లిలో పర్యటించారు. అంతకుముందు కల్లితండాలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధంలో వీరమరణం పొందిన కల్లితండా వాసి మురళీ నాయక్ కుటుంబీకులను ఇప్పటికే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారన్నారు. వీర జవాన్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఆయన కుటుంబానికి అండగా నిలిచేందుకు స్వయంగా వస్తున్నట్లు వెల్లడించారు.
వీరమరణం పొందిన
మురళీ నాయక్
అనంతపురం కార్పొరేషన్: ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధంలో శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన మురళీనాయక్ వీరమరణం పొందారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. మాతృభూమి కోసం మురళీనాయక్ ప్రాణత్యాగం చేశారన్నారు. చిన్న వయసులోనే మృతి చెందడం చాలా బాధగా ఉందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ప్రధానంగా మురళీనాయక్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
●దేశ సేవలో అమరుడైన మురళీ నాయక్ ●కన్నీటిసంద్రమైన స్వగ్రామం కల్లితండా
●అతని జ్ఞాపకాలు తలచుకుని రోదిస్తున్న స్నేహితులు ●ఘన నివాళులర్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులు
సైన్యంలో చేరాలన్న కలను నెరవేర్చుకున్నావ్
పాతికేళ్లకే జీవితాన్ని దేశానికి అంకితమిచ్చావ్
అక్కచెల్లెమ్మల నుదుటి సిందూరం చెరిపిన..
ఉగ్రమూకలకు బదులు చెప్పావ్
దేశానికి కవచంలా నిలబడి వీరోచిత పోరాటం చేశావ్
శత్రుసేనలను చెండాడుతూ సరిహద్దులో సగర్వంగా నిలిచావ్
మాతృభూమి కోసం చివరి నెత్తురుబొట్టునూ చిందించావ్
సలాం సైనిక..
నీ త్యాగం మరువం.. నీ పోరాటం వృథా కానివ్వం
నీ రక్తాన్నే సిరాగా రాసిన చరితను వెయ్యేళ్లు చదువుకుంటాం
మువ్వన్నెల పతాకమై ఎగిరిన నీ ధైర్యం సాక్షిగా చెబుతున్నాం
ఆ పా(పి)కిస్తాన్ గాళ్లకు మరణశాసనం రాస్తాం
యుద్ధమంటే పోరాటం కాదని..మాతృభూమిపై ప్రేమని చాటిచెబుతాం
జీవన రవళిలా ‘మురళి’ గానం చేస్తూనే ఉంటాం
సలాం సైనిక... సలాం
గోరంట్ల: పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధంలో శత్రుమూకలను తరిమికొడుతూ వీరోచిత పోరాటం చేసిన మురళీనాయక్ అమరుడయ్యారన్న విషయం తెలియగానే అతని స్వగ్రామం గోరంట్ల మండలంలోని కల్లితండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 150 ఇళ్లు మాత్రమే ఉన్న తండాలో అందరూ గిరిజనులే. శుక్రవారం ఉదయం మురళీ నాయక్ వీరమరణం గురించి తెలియగానే తండావాసులంతా మురళీనాయక్ స్వగృహానికి చేరుకున్నారు. తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాంనాయక్‌లను ఓదార్చారు. మురళీనాయక్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని పొగిలిపొగిలి ఏడ్చారు. గ్రామంలో చిన్నాపెద్ద తేడాలేకుండా అందరితో కలసిమెలసి ఉండేవాడని, అలాంటి బిడ్డ దేశం కోసం శత్రువుల చేతిలో అసువులుబాయడంతో వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్నప్పటి నుంచే దేశభక్తి మెండుగా ఉన్న మురళీ నాయక్...చాలా పట్టుదల గలవాడన్నారు. తాను అనుకున్నట్లే ఆర్మీలో చేరి దేశ సేవలో అమరుడయ్యారని విలపించారు. దేశం కోసం ప్రాణాలిచ్చిన గిరిజన ముద్దుబిడ్డ మురళీనాయక్ విగ్రహాన్ని మండల కేంద్రమైన గోరంట్లలో ఏర్పాటు చేయాలని అఖిల భారత బంజారా సంఘం నాయకులు, కుటుంబ సభ్యులు కోరారు.
దేశభక్తి ఎక్కువ
మురళీ నాయక్ చాలామంచి అబ్బాయి. చిన్నప్పటి నుంచి దేశ భక్తి ఎక్కువ. ఎప్పుడూ సైన్యంలో పనిచేయాలని చెప్పేవాడు. అందుకే ఎన్ని అవకాశాలు వచ్చినా సైన్యంలోనే చేరాడు. నిరుపేద కుటుంబంలో పుట్టి దేశం కోసం ప్రాణాలు అర్పించి చరిత్రలో మిగిలిపోయాడు.
– చాంప్లానాయక్, కల్లితండా
నమ్మలేకపోతున్నాం
మురళీనాయక్ దేశం కోసం ప్రాణత్యాగం చేయడం గర్వంగా ఉంది. కానీ పాతికేళ్లు కూడా లేని బిడ్డకు అప్పుడే నిండు నూరేళ్లు నిండాయంటే నమ్మలేకపోతున్నాం. ఏకైక సంతానాన్ని పోగొట్టుకున్న అతని తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అతని వీరోచిత పోరాటం వృథా కాదని భావిస్తున్నాం.
– గోవింద నాయక్, కల్లితండా
సలాం సైనిక
సోమందేపల్లిలో విద్యాభ్యాసం

13న కల్లితండాకు వైఎస్ జగన్

13న కల్లితండాకు వైఎస్ జగన్

13న కల్లితండాకు వైఎస్ జగన్

13న కల్లితండాకు వైఎస్ జగన్

13న కల్లితండాకు వైఎస్ జగన్