
జిల్లా ప్రజల ఆశలపై నీళ్లు
ఉరవకొండ/ వజ్రకరూరు: ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురుచూసిన జిల్లా ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నిరాశపరిచింది. శుక్రవారం వజ్రకరూరు మండలం ఛాయాపురం వద్ద హంద్రీ–నీవా కాలువ వెడల్పు పనుల పరిశీలనతో పాటు ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. సంపదను సృష్టించి జిల్లాను అభివృద్ధి చేస్తానని, ఇంట్లో ఎక్కువమంది పిల్లలను కని జనాభా పెంచేలా చూడాలని చెప్పడం తప్ప హామీల అమలుపై సీఎం తన ప్రసంగంలో ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. తల్లికి వందనం పథకం త్వరలోనే అమలు చేస్తామని, అన్నదాత సుఖీభవ పథకం కేంద్రం వాటా ఇచ్చిన రోజే రాష్ట్రం తరఫున నిధులు విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎప్పుడు అమలు చేస్తారని కొందరు మహిళలు అడిగితే.. సీఎం సమాధానం ఇవ్వలేదు. మరికొన్ని ముఖ్యమైన సూపర్ సిక్స్, తదితర పథకాల గురించి మాట్లాడకపోవడంతో పలువురు అసహనం వ్యక్తం చేస్తూ సభ నుంచి బయటకు వెళ్లిపోవడం కనిపించింది. షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి ఉదయం 12 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకోవాల్సి ఉండగా.. గంట ఆలస్యంగా చేరుకున్నారు. ప్రజావేదికలోకి పోలీసులు ఉదయం 9 గంటలకే ప్రజలను అనుమతించడంతో ఎండ తీవ్రతకు కూర్చోలేక అవస్థలు పడ్డారు. సభకు వచ్చిన వారికి సరిపడు తాగునీరు అందుబాటులో ఉంచకపోవడంతో ఇబ్బందులు పడ్డారు.
నిర్వాసితులకు పరిహారం మంజూరు చేస్తాం
జీడిపల్లి భూనిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామని, 34, 36 ప్యాకేజీ పనులు పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆమిద్యాల బ్రాంచ్ కెనాల్ పూర్తి చేసి, కొట్టాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేస్తామన్నారు. మెగా డ్రిప్ ఇరిగేషన్ కింద 40వేల ఎకరాలకు జీడిపల్లి ద్వారా నీరు అందించి పథకాన్ని పునఃప్రారంభిస్తామన్నారు. ఉరవకొండకు టెక్స్‌టైల్ పార్కు, రామసాగరం వంతెన మంజూరు చేస్తామన్నారు. జీడిపల్లి, బీటీపీ పనులకు కూడా ప్రాధ్యానత ఇచ్చి పూర్తి చేస్తామన్నారు. ఛాయాపురంలో కూడా సీసీరోడ్లు, డ్రైనేజీలు, ఇళ్ల నిర్మాణాలు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, కలెక్టర్ వినోద్‌కుమార్, జాయింట్ కలెక్టర్ శివనారాయణ్‌శర్మ, ఎస్పీ జగదీష్, ఎమ్మెల్యేలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సీఎం పర్యటన అడ్డుకునేందుకు యత్నం
వజ్రకరూరు మండలం ఛాయాపురంలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను ఏబీవీపీ నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. జీఓ 77ను రద్దు చేయకుండా జిల్లాలోకి అడుగుపెట్టనీయబోమని ఏబీవీపీ నాయకులు ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలో వజ్రకరూరు సమీపంలో సీఎం డౌన్ డౌన్, జీఓ 77ను రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తు సీఎం సభ వద్దకు చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని చిన్నహోతురు వద్ద అరెస్టు చేసి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉంచారు. ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అఖిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ లోకేష్ ‘యువగళం’ పాదయాత్రలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జీఓ 77ను రద్దు చేసి ప్రతి విద్యార్థికీ స్కాలర్‌షిప్ అందిస్తామని హమీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జీఓ రద్దు చేయకుండా మోసం చేశారన్నారు. ప్రతి విద్యార్థికీ ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ ఇవ్వని పక్షంలో ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సుధీర్, నిఖిల్, తేజ, భూతరాజు తదితరులు పాల్గొన్నారు.
సూపర్ సిక్స్ అమలుపై స్పష్టత ఇవ్వని సీఎం చంద్రబాబు

జిల్లా ప్రజల ఆశలపై నీళ్లు