
బీసీ మహిళల స్కీంలో మంత్రి సవిత స్కాం
చిలమత్తూరు: బీసీ సంక్షేమశాఖామంత్రి సవిత మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని బీసీ మహిళలను మోసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వైఎస్సార్‌సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక విమర్శించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చౌళూరు మధుమతిరెడ్డితో పాటు నాయకులతో కలిసి హిందూపురం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దీపిక మాట్లాడుతూ కుట్టు మిషన్ల పేరుతో సీఎం చంద్రబాబు, మంత్రి సవిత ఉమ్మడిగా మహిళలకు కుచ్చుటోపీ పెట్టారన్నారు. స్కీం బడ్జెట్ అమాంతం పెంచి సుమారు రూ. 150 కోట్లు నొక్కేసేందుకు స్కెచ్ వేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం టెండర్లకు ఆహ్వానించగా 65 కంపెనీలు బిడ్ వేశాయని అయితే ఇందులో 56 సంస్థలను ముందుగానే తిరస్కరించి రాజకీయానికి తెరతీశారన్నారు. మిగిలిన 9 సంస్థల్లో టెండర్లు తెరవకముందే ఆరింటిని తొలగించి చివరకు మూడు కంపెనీలు మిగిలేలా చేశారన్నారు. వాటిలో హైదరాబాద్‌కు చెందిన శ్రీటెక్నాలజీస్ వారు రూ. 21,798 తక్కువ కోట్ చేసి ఎల్1 గా నిలవగా, ఎల్ 2, ఎల్3 గా హైదరాబాద్‌కు చెందిన మరో రెండు సంస్థలు నిలిచాయన్నారు. అయితే ఎల్1కి కేవలం 5 శాతం పని మాత్రమే అప్పజెప్పి మిగిలిన రెండు సిండికేట్ కంపెనీలకు 95 శాతం పనులు అప్పగించారన్నారు. మార్చి 8న పథకాన్ని ప్రకటించగా 90 రోజులు శిక్షణ కాలంలో ఇప్పటికే 50 రోజులు పూర్తి కావొచ్చినా నామమాత్రంగా శిక్షణ ఇచ్చి మొత్తానికే ఎసరు పెట్టారన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు నాగమణి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆసిఫ్, మున్సిపల్ వైస్ చైర్మన్ జబీవుల్లా, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు మహే ష్‌గౌడ్, చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం రూరల్ మండల కన్వీనర్లు రామకృష్ణారెడ్డి, నిస్సార్ అహ్మద్, శివశంకర్‌రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
రూ.76 కోట్లతో ముగిసే స్కీంను రూ.257 కోట్లకు పెంచి అవినీతి
మంత్రి సవితపై వైఎస్సార్‌సీపీ
సమన్వయకర్త టీఎన్ దీపిక ఆగ్రహం