
బాబుపై గురువుల గుర్రు
కదిరి: ‘ఏరు దాటేదాక ఓడ మల్లన్న..ఏరు దాటాక బోడి మల్లన్న’ అనే చందంగా సీఎం చంద్రబాబు వ్యవహరశైలి ఉందని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు తమను ఆశల పల్లకీలో విహరింపజేశారని, అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తున్న నేటికీ ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు.
గొంతెమ్మ కోర్కెలేవీ కోరలేదు..
తమకు న్యాయబద్ధంగా అందాల్సిన ఐఆర్, పీఆర్సీ, పెండింగ్ డీఏలను మాత్రమే అడుగుతున్నామని, అంతకు మించి ఎలాంటి గొంతెమ్మ కోర్కెలు, బోనస్‌లూ అడగడం లేదని ఉపాధ్యాయులు అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 11 నెలల కాలంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు జీతాలు ఇవ్వడం మినహా ఇంకెలాంటి ఆర్థిక ప్రయోజనం చేకూర్చలేదని మండిపడ్డారు. విడుదల చేసిన నిధుల్లో రూ2,300 కోట్లు సీపీఎస్ మ్యాచింగ్ గ్రాంట్‌కే సరిపోయిందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పీఎఫ్, పీఎల్‌ఎస్‌లు విడుదల చేయడం తప్ప ఐఆర్, పీఆర్‌సీల ఊసెత్తడం లేదని, ఉద్యోగ విరమణ చేసిన వారికి న్యాయంగా అందాల్సిన డబ్బులు కూడా ఈ ప్రభుత్వం చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) ఉద్యోగులను ఓపీఎస్ పరిధిలోకి తీసుకొస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు స్పష్టమైన హామీనిచ్చారని గుర్తు చేశారు. దీనిపై బాబు సర్కారు నేటికీ నోరు మెదపడం లేదన్నారు.
ప్రభుత్వం మెడలు వంచేందుకు పోరుబాట..
అలవిగాని హామీలతో ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేసిన కూటమి సర్కార్ మెడలు వంచేందుకు ఉద్యమ కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెలిపారు. సీపీఎస్ రద్దు కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట పట్టాలని నిర్ణయించినట్లు వివరించారు. తమ న్యాయపరమైన డిమాండ్ల సాధనకు ఈ నెల 9న (నేడు) ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం ఉంటుందన్నారు. అలాగే ఈ నెల 12న జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ధర్నాకు యూటీఎఫ్ పిలుపునిచ్చింది. అలాగే ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా డీఈఓ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టనున్నట్లు యూటీఎఫ్ నాయకులు తెలిపారు
ఉపాధ్యాయుల డిమాండ్‌లు కొన్ని..
● కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పినట్లు 117 జీఓను తక్షణం రద్దు చేయాలి.
● ఫౌండేషన్ స్కూళ్ల ఆలోచన మానుకోవాలి.
● ప్రస్తుతమున్న 1 నుంచి 5వ తరగతి వరకూ ప్రాథమిక పాఠశాలలు, 1 నుంచి 8వ తరగతి వరకూ ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలు, 1 నుంచి 5 వరకు ఉన్న మోడల్ ప్రైమరీ స్కూళ్లు, 6 నుంచి 10 వరకు ఉన్న ఉన్నత పాఠశాలలను యథాతథంగా కొనసాగించాలి.
● ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు, 12వ పీఆర్సీ, 3 డీఏలు తక్షణం విడుదల చేయాలి.
● సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమలు చేయాలి.
● పాఠశాలల పునఃవ్యవస్థీకరణ, బదిలీలు, పదోన్నతుల సమస్యలు తక్షణం పరిష్కరించాలి.
ఎన్నికల వేళ అయ్యవార్లకు వరాల జల్లు
అధికారం చేపట్టిన తర్వాత ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు గాలికి
ఐఆర్, పీఆర్సీ, పెండింగ్ డీఏల ఊసెత్తని కూటమి సర్కారు
నేడు కలెక్టరేట్ ఎదుట నిరసనకు
ఏపీటీఎఫ్ పిలుపు
12న డీఈఓ కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ధర్నా
ఇచ్చిన హామీలు నెరవేర్చండి
ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు కూటమి నేతలు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆగ్రహం చవిచూడక తప్పదు.
– డా.పి.వి.రమణారెడ్డి,
వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్షుడు
పోరుబాటకు సిద్ధంకండి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టిన వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయుల పాత బకాయిలు వెంటనే చెల్లించాల్సి ఉంది. దాదాపు ఏడాది కావస్తున్నా దీనిపై ఎలాంటి స్పందన లేదు. మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఐఆర్, పీఆర్సీ ఊసే లేదు. న్యాయపరమైన డిమాండ్ల సాధనకు పోరాటాలకు సిద్ధంకండి. – జి.హరిప్రసాద్‌రెడ్డి,
ఎస్టీయూ జిల్లా అథ్యక్షుడు

బాబుపై గురువుల గుర్రు

బాబుపై గురువుల గుర్రు