
పచ్చ మీడియా కుట్రలను తిప్పికొడదాం
అనంతపురం కార్పొరేషన్: అవాస్తవాలను ప్రచారం చేస్తూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ ప్రజలను వంచనకు గురి చేస్తున్న పచ్చ మీడియా కుట్రలను తిప్పికొడదామంటూ ప్రవాసాంధ్రులకు వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం కో ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరిగిన వైఎస్సార్‌సీపీ గ్లోబల్ కనెక్ట్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆకాంక్షలతో కూడిన చర్చ జరిగింది. ప్రవాసాంధ్రులు భావోద్వేగతంతో వైఎస్సార్‌సీపీ పట్ల తమకున్న అభిమానాన్ని చాటారు. ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సాగించిన 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల బాధలు, వారి అవసరాలను తెలుసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయగానే అన్నింటినీ నెరవేర్చారని గుర్తు చేశారు. మేనిఫెస్టోను ఓ కాగితంగా కాకుండా ప్రజా ఒప్పందంగా నిరూపించారన్నారు. రూ.4.47 లక్షల కోట్లను నేరుగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయ్యేలా చర్యలు తీసుకున్నారన్నారు. ఆర్థికాభివృద్ధిలో భాగంగా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులను, 90కి పైగా మౌలిక ప్రాజెక్ట్‌లను తీసుకువచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల్లోనే రాష్ట్రంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ సంక్షేమ పథకాలకు తిలోదకాలు ఇచ్చేసిందన్నారు. ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలు, అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లోకి వ్యతిరేకత మొదలైందన్నారు. ఇలాంటి తరుణంలో ప్రజలకు అండగా నిలబడేందుకు అందరూ సామాజిక మాధ్యమాల ద్వారా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జగనన్న చేసిన మేలును గణాంకాలతోనే తెలియజేస్తూ.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను చైతన్యపరిచేందుకు అందరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైఎస్సార్‌సీపీ కన్వీనర్ సూర్యనారాయణరెడ్డి, క్వీన్స్‌ల్యాండ్ కన్వీనర్ బ్రహ్మారెడ్డి, పాల్గొన్నారు.
బ్రిస్బేన్‌లో వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం కో ఆర్డినేటర్ ఆలూరు