
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి
పుట్టపర్తి: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు అన్నారు. తొలిసారి పుట్టపర్తికి విచ్చేసిన ఆయన స్థానిక ఓ హోటల్‌లో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, గౌరవాధ్యక్షుడు రజనీకాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, దామోదరరెడ్డి, సుధామణి, వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి, అపాస్ జిల్లా అధ్యక్షుడు సురేష్ తదితరులతో ఆదివారం సమావేశమై మాట్లాడారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా వారు వినతి పత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో ఎమ్మెల్సీ మాట్లాడారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికి ఇప్పటికే సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చర్చించినట్లు తెలిపారు. పాత బకాయిలతో పాటు మెరుగైన ఐఆర్, పీఆర్సీ అందించాలని కోరామన్నారు. వేసవిలో క్లాసులు బోధించే టీచర్లకు ఈఎల్ మంజూరు చేయాలన్నారు. డీఎస్సీ రిక్రూట్‌మెంట్ ప్రశ్న పత్రాలు జిల్లాల వారీగా కాకుండా రాష్ట్రం మొత్తం ఒక్కటే ఉండేలా చూడాలని సూచించారు. తరగతి గదిలో 40 మంది విద్యార్థులు ఉండేలాచూడాలని, ప్రాథమికోన్నత పాఠశాలలో అన్ని సబ్జెక్టులకు టీచర్లను నియమించాలని కోరామన్నారు. విడతల వారీగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సీఎం భరోసానిచ్చినట్లుగా తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు తలమర్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు