
సువర్ణ వాసవీ మాత విగ్రహావిష్కరణ
హిందూపురం: ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన 2.5 కేజీల సువర్ణ వాసవీ మాత విగ్రహాన్ని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా వందలాది మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే బాలకృష్ణ చొరవతో లేపాక్షి ప్రాంతంలో దాదాపు 10 వేల ఎకరాల్లో పరిశ్రమల హబ్ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు భూ సేకరణ చేపడుతున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 10 నెలల్లోనే రూ.8 లక్షల కోట్లపైగా పెట్టుబడితో పరిశ్రమల స్థాపన కోసం పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారన్నారు. పదో తరగతి పరీక్షల్లో అధికమార్కులు సాధించిన ఆర్యవైశ్య విద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రమేష్‌కుమార్, ఆర్యవైశ్యసంఘ అధ్యక్షులు జేపీకేరాము, కార్యదర్శి శ్రీకాంత్, నాయకులు కోట సత్యం, రవికుమార్, వెంకటేష్, నరసింహులు, లక్ష్మీకాంత్,టీడీపీ నాయకులు అంజనప్ప, కౌన్సిలర్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.