విధి వంచితులు | - | Sakshi
Sakshi News home page

విధి వంచితులు

Oct 17 2024 12:20 AM | Updated on Oct 17 2024 12:20 AM

విధి

విధి వంచితులు

పొదరిల్లులా అల్లుకున్న ఓ కుటుంబ బంధాన్ని విధి ఒక్కొక్కటిగా తుంచేస్తోంది. క్యాన్సర్‌తో సతమతమవుతున్న ఇల్లాలిని ఆస్పత్రిలో చేర్పించి ఖర్చులకు చేతిలో చిల్లిగవ్వలేక అప్పు కోసం వచ్చిన ఇంటి పెద్దను ప్రమాదం అవిటివాడిని చేసింది. అదే సమయంలో ఇల్లాలు కన్నుమూసింది. అప్పుడప్పుడే ఊహ తెలుస్తున్న వయసులో ఇద్దరు చిన్నారులు తల్లి మృతదేహం వద్ద దీనంగా ఏడుస్తుంటే కనీసం వారిని అక్కున చేర్చుకుని ఓదార్చలేని స్థితిలో తండ్రి కుమిలికుమిలి రోదించాడు. విధి ఆడిన ఈ నాటకంలో బలి అయింది మాత్రం చిన్నారులే. కదలలేక మంచాన పడిన నాన్నకు చికిత్స అందించే ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు.

రొద్దం: మండలంలోని రెడ్డిపల్లి దళిత వాడలో నివాసముంటున్న హరిజన నరసింహులు, దుర్గమ్మ (30) దంపతులకు ఏడేళ్ల వయసున్న అనన్య, ఐదేళ్ల వయసున్న నదీష్‌ అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఓ చిన్నపాటి పూరి గుడిసె తప్ప మరో ఆస్తిపాస్తులేమీ లేవు. రోజూ కూలి పనులకు వెళితే తప్ప పూట గడవని పరిస్థితి.

కబళించిన క్యాన్సర్‌

అరకొర సంపాదనలోనే పిల్లల భవిష్యత్తు కోసం కొంత దాచి ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్న తరుణంలో ఆ నిరుపేద కుటుంబంపై విధి కన్నెర్ర చేసింది. కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న భార్యకు చికిత్స కోసం పలు ఆస్పత్రుల చుట్టూ నరసింహులు తిరిగాడు. అయినా నయం కాలేదు. దీంతో బెంగళూరుకు పిలుచుకెళ్లి చూపించాడు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం ఆమె క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పిల్లల భవిష్యత్తు కోసం దాచిన డబ్బు కాస్త భార్య చికిత్సకు ఖర్చు పెట్టాడు. అయినా ప్రయోజనం దక్కలేదు. దీంతో అప్పు చేయాల్సి వచ్చింది. తెలిసిన వారి వద్ద అప్పు చేసి బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తూ వచ్చాడు.

అప్పు కూడ పుట్టక...

నరసింహులు కుటుంబంపై కక్ష కట్టిన విధి... చివరకు అప్పు కూడా పుట్టకుండా చేసింది. దీంతో చేతిలో ఉన్న డబ్బు కాస్త అయిపోవడంతో దిక్కుతోచని స్థితిలో బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్యను మంగళవారం డిశ్చార్జ్‌ చేయించుకుని కర్ణాటకలోని పావగడ తాలూకా నెనగానిపల్లిలోని ఆమె పుట్టింటికి తీసుకెళ్లాడు. పరిస్థితి మొత్తం అత్తింటి వారికి వివరించి, తాను గ్రామానికి వెళ్లి డబ్బు సమకూర్చుకుని వస్తానని, అప్పటి వరకూ తన భార్యను జాగ్రత్తగా చూసుకోవాలని కోరాడు. అదే రోజు రెడ్డిపల్లికి చేరుకుని అప్పు కోసం ప్రతి ఇంటి తలుపూ తట్టాడు. అయినా ఎక్కడేగాని నయాపైసా ఇచ్చేవారు కనిపించలేదు. తన భార్య దైన్య స్థితిని వివరించి ప్రాధేయపడ్డాడు. ఇప్పటికే చాలా డబ్బు ఇచ్చామని, ఆ మొత్తం చెల్లించిన తర్వాతనే కొత్త అప్పు ఇస్తామంటూ కొందరు వడ్డీ వ్యాపారులు చేతులెత్తేశారు.

అపహసించిన విధి

గ్రామంలో అప్పు పుట్టక దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న నరసింహులుకు బుధవారం ఉదయం అత్తింటి వారి నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. దుర్గమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, వెంటనే వచ్చి ఇంటికి పిలుచుకెళ్లాలని అత్తింటి వారు తెలపడంతో వెంటనే నెనగానిపల్లికి బయలుదేరాడు. మార్గం మధ్యలో పావగడలో దిగి నెనగానిపల్లికి వెళ్లేందుకు ఆటో కోసం ఎదురు చూస్తూ ఓ పాత గోడ కిందకు చేరుకున్నాడు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బాగా తడిసిన పాత గోడ అప్పటికే మొదలైన వర్షానికి ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకున్న నరసింహులును స్థానికులు వెలికి తీసి, పావగడలోని ఆస్పత్రికి చేర్చారు. కుడికాలు విరిగింది. ఎడమకాలు తొడపై బలమైన మూగదెబ్బలు తగిలాయి. ఆస్పత్రిలో విరిగిన కాలుకు వైద్యులు కట్టు కడుతున్న సమయంలోనే అత్తింటి వారు ఫోన్‌ చేసి దుర్గమ్మ చనిపోయిందని తెలిపారు. విధి మరోసారి తనను వెక్కిరించడంతో ఆస్పత్రిలోనే నరసింహులు కన్నీరుమున్నీరుగా విలపించాడు.

క్యాన్సర్‌తో పోరాడుతూ

ఆస్పత్రి పాలైన ఇల్లాలు

అప్పు కోసం ఇంటికి వచ్చిన భర్త

అనుకోని ప్రమాదంలో కాలు విరిగి ఆస్పత్రి పాలు

అదే సమయంలో ఆస్పత్రిలో

కన్నుమూసిన ఇల్లాలు

విధి వంచితులైన ఇద్దరు చిన్నారులు

అశ్రునయనాలతో అంతిమ సంస్కారం

నరసింహులు పరిస్థితిని తెలుసుకున్న బంధువులు ఓ వైపు దుర్గమ్మ మృతదేహాన్ని, మరోవైపు నరసింహులునూ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేయించుకుని రెడ్డిపల్లికి చేర్చారు. విషయం తెలుసుకున్న గ్రామం మొత్తం బాధితుల పూరి గుడిసె వద్దకు చేరుకుంది. ఓ వైపు భార్య మృతదేహం... మరో వైపు నేలపైనే కదలలేని స్థితిలో ఉన్న భర్తను చూసి కంట తడి పెట్టారు. అంతిమ సంస్కారాలు చేసేందుకు సైతం చేతిలో చిల్లిగవ్వ లేక నరసింహులు పడుతున్న ఇబ్బందిని గుర్తించిన పలువురు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేశారు. ‘అమ్మా! లే అమ్మ... ఒక్కసారి కళ్లు తెరిచి చూడమ్మ’ అంటూ రోదిస్తున్న చిన్నారులను చూసి కంట తడి పెట్టని వారంటూ లేరు. ఈ నేపథ్యంలో నాన్న చికిత్సకు సాయం చేయాలని చిన్నారులు అభ్యర్థిస్తున్నారు.

దాతలు సాయం చేయదలిస్తే...

పేరు : ఎం.రామాంజనేయ (బాధితుడి బావమరిది)

బ్యాంక్‌ : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పావగడ బ్రాంచ్‌

ఖాతా నంబర్‌ : 6747 010 001 7923

ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ : BARB0VJPAVA

ఫోన్‌పే నంబర్‌ : 63623 74677

విధి వంచితులు1
1/1

విధి వంచితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement