
రాతి దూలాన్ని లాగుతున్న వృషభాలు
బొమ్మనహాళ్: గజగౌరీ ఉత్సవాల్లో భాగంగా బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్‌లోని జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బుధవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి వృషభాల బల ప్రదర్శన హోరాహోరీగా సాగింది. పోటీలను ఎంపీ తలారి రంగయ్య ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు 10 జతల వృషభాలను పోటీలకు తీసుకువచ్చారు. బెళుగుప్ప మండలం గంగవరానికి చెందిన రైతు వెంకటేష్ వృషభాలు 6 వేల అడుగుల దూరం దూలాన్ని లాగి మొదటి బహుమతిని గెలుచుకున్నాయి. అలాగే ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామ రైతు చెన్నప్ప వృషభాలు 5,971 అడుగుల దూరం లాగి రెండో బహుమతి, కళ్యాణదుర్గం మండలం బోరంపల్లికి రైతు నీరుగంటి నాగరాజు వృషభాలు 5,079.3 అడుగుల దూరం లాగి మూడో బహుమతి, రాయదుర్గం రైతు బంగి క్రిష్ణయ్య వృషభాలు 4,808.9 అడుగుల దూరం లాగి నాల్గో బహుమతి గెలుచుకున్నాయి.