
ధర్మవరం రైల్వేస్టేషన్‌లో వందేభారత్ రైలుకు స్వాగతం పలుకుతున్న ప్రజలు, విద్యార్థులు
● ప్రజల నుంచి రైలుకు ఘన స్వాగతం
ధర్మవరం/హిందూపురం: ‘జయహో వందేభారత్’ నినాదాలతో ధర్మవరం, హిందూపురం రైల్వేస్టేషన్లు ఆదివారం హోరెత్తాయి. ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కాచిగూడ నుంచి బయలుదేరి అనంతపురం మీదుగా ఆయా రైల్వేస్టేషన్లకు చేరుకుంది. స్థానికులు, విద్యార్థులతో కలిసి హిందూపురంలో ఎంపీ గోరంట్ల మాధవ్ రైలుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా మీదుగా వందేభారత్ రైలు పరుగులు పెట్టడం సంతోషదాయకమన్నారు. హిందూపురంలో ఆగేలా చూడాలని రైల్వే ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయంపై వైఎస్సార్ సీపీ హిందూపురం సమన్వయకర్త దీపిక, మున్సిపల్ చైర్‌పర్సన్ ఇంద్రజతో కలిసి స్థానిక అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
సందడే.. సందడి
ధర్మవరంలో సందర్శకుల వీక్షణ కోసం వందే భారత్ రైలు అరగంట ఆపడంతో సందడి నెలకొంది. కోచ్‌లను చూసేందుకు జనం ఆసక్తి చూపారు. కాచిగూడ నుంచి ధర్మవరం మీదుగా బెంగళూరుకు వారంలో 6 రోజులు ‘వందేభారత్’ రాకపోకలు ఉంటాయని, పట్టు చీరల వ్యాపార కేంద్రమైన ధర్మవరం ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని రైల్వే ఉన్నతాధికారులు పేర్కొన్నారు. 530 మంది దాకా ప్రయాణికులు కూర్చోవచ్చన్నారు. ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్, ఏడు చైర్ కార్ కోచ్‌లు ఉంటాయని పేర్కొన్నారు. వందేభారత్ రాక సందర్భంగా రైల్వేస్టేషన్ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రైల్వేస్టేషన్ మేనేజర్ నరసింహనాయుడు, జీఆర్‌పీ సీఐ బోయ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

రైల్వే అధికారులకు వినతిపత్రం సమర్పిస్తున్న ఎంపీ గోరంట్ల మాధవ్, సమన్వయకర్త దీపిక