
‘భవిష్యత్తుకు గ్యారంటీ’ కనిపించడం లేదు. ‘స్కిల్’ అక్రమాల కేసులో అధినేత అరైస్టె టీడీపీని పూర్తిగా ముంచేశారు. కేడర్‌ను కాపాడాల్సిన చినబాబు హస్తిన చేరారు. అరెస్టు భయం వెంటాడుతుండటంతో బడా నాయకులు ఎవరూ ముందుకు రావడం లేదు. ఫలితంగా జిల్లాలో టీడీపీ క్రమంగా జీరో అవుతోంది. ముందుండి నడిపించే నాయకుడు లేక తమ్ముళ్లలో నైరాశ్యం నెలకొంది.
సాక్షి, పుట్టపర్తి: టీడీపీ వెంట నడిస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీర్మానించుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే చాలా చోట్ల ఇతర పార్టీల్లో చేరారు. మరికొందరు చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాల అమలు చేసి అన్ని వర్గాల వారికీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేరువయ్యారు. ఈ క్రమంలో ఆ పార్టీ ఈ పార్టీ ఎందుకని వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకునేందుకు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు రెడీ అవుతున్నారు. ఇటీవల జిల్లావ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి చేరికలు పెరిగాయి. 2019 ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 12 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలు కై వసం చేసుకున్న వైఎస్సార్‌సీపీ.. ఈసారి అంతకుమించి స్థానాలు సాధించే దిశగా బలపడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
మేం నమ్మం బాబూ..
చంద్రబాబు అరెస్టుతో జిల్లాలో టీడీపీ నేతలకు వణుకు పట్టుకుంది. ‘అక్రమ అరెస్టు..’అని అధిష్టానం అంటున్నా.. ‘తమ్ముళ్లే’ నమ్మడం లేదు. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఎంత బతిమలాడినా వెంట నడిచేందుకు కార్యకర్తలు సుముఖత చూపడం లేదు. దీంతో ఇన్‌చార్జ్‌లు కూడా చేసేది లేక ఒకట్రెండు రోజులు హంగామా చేసి తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. మరికొందరు నియోజకవర్గ కేంద్రం వదిలి బంధువుల ఊళ్లు, స్వగ్రామాలు, బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్లినట్లు తెలిసింది. బాబు జైలులో.. చినబాబు ఢిల్లీలో ఉండటంతో డైరెక్షన్ చేసే దిక్కు లేక.. తలోదారి చూసుకుంటున్నట్లు సమాచారం.
బీజేపీ ప్రయత్నాలు ఫ్లాప్!
టీడీపీకి మద్దతు ఇస్తామని.. కలిసి పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ మేరకు క్షేత్రస్థాయిలో సయోధ్య కుదరడం లేదు. ఈ క్రమంలో రెండు పార్టీల నేతల మధ్య చీలికలు వచ్చి కేడర్‌లో స్థైర్యం మరింత దెబ్బతిన్నట్లు సమాచారం. ఇదే అదనుగా టీడీపీ – జనసేన నేతలను ఆహ్వానించి బలపడాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నా.. రాష్ట్రంలో బలంగా లేని ఆ పార్టీలో చేరడం కంటే అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవైపే ఆయా పార్టీల నాయకులు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.
ఈ సారి క్లీన్‌స్వీపే..
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీని బలోపేతం చేస్తున్నాం. ఈసారి ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడం ఖాయం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. టీడీపీకి దిక్కు లేకుండా పోయింది. ఓట్లు అడిగే అర్హత కూడా కోల్పోయింది. అందరి సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అమలు చేసిన వైఎస్సార్‌సీపీకి మరోసారి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
– మాలగుండ్ల శంకరనారాయణ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు