
ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసిన కందిపంట
మడకశిర: ప్రకృతి వ్యవసాయంలో రాణించేలా దళిత రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వారికి అండగా నిలిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన(పీఎంఏజేఏవై) ద్వారా ఇప్పటికే జిల్లాలోని 1,107 మంది దళిత రైతులను అధికారులు గుర్తించి, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ పథకం కింద ఎస్సీ రైతులకు ఉచితంగా వివిధ రకాల విత్తన కిట్లు, పరికరాలను ప్రభుత్వం అందజేస్తోంది.
తొలి విడతలో 1,107 మంది ఎంపిక:
జిల్లా వ్యాప్తంగా 11,759 మంది ఎస్సీ రైతులు ఉండగా వీరిలో 1,107 మందికి పీఎంఏజేఏవై పథకం వర్తింపజేశారు. మొత్తం 12,944 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని రైతులు చేపట్టారు. ఒక్క మడకశిర నియోజకవర్గంలోనే ఈ పథకానికి 754 మంది ఎస్సీ రైతులకు పథకం లబ్ధి చేకూరింది. ఒక్కో రైతుకు రూ.10వేలు విలువ చేసే విత్తన కిట్లు, పరికరాలను ఉచితంగా అందజేశారు. కిట్ల రూపంలో కందులు, పెసలు, వేరుశనగ, రాగులు, కొర్ర, సజ్జ విత్తనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. సీడ్ టు సీడ్ (ప్రారంభం నుంచి చివరి వరకు ప్రకృతి వ్యవసాయ విధానంలోనే పంటలు పండించడం) కిట్లలో మొక్క జొన్న, జొన్న, సజ్జ, పెసలు, కందులు, శనగ విత్తనాలు అందజేస్తున్నారు. వీటితో పాటు కిచెన్ గార్డెన్ కూరగాయల కిట్లను రెండు చొప్పున ఇస్తున్నారు. వీటికి తోడుగా ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన పరికరాలు కూడా ఇస్తున్నారు. వంద లీటర్ల డ్రమ్ములు రెండు, 200 లీటర్ల డ్రమ్ము ఒకటి, 30 పసుపు జిగట అట్టలు, 8 లింగాకర్షక బుట్టలు ఇస్తున్నారు. ఎస్సీ రైతులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ కిట్లను పూర్తి ఉచితంగా అందజేస్తోంది.
ఎస్సీ రైతులకు అందించే
వివిధ రకాల పరికరాలు
100 లీటర్ల డ్రమ్ములు : 2
200 లీటర్ల డ్రమ్ములు : 1
టార్పాలిన్ : 1
పసుపు జిగట అట్టలు : 30
లింగాకర్షక బుట్టలు : 8
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా
ప్రత్యేక ప్రోత్సాహం
ప్రకృతి వ్యవసాయం చేపట్టే రైతులకు ఉచితంగా విత్తన కిట్ల అందజేత
అందుబాటులో అవసరమైన పరికరాలు
ఒక్కో రైతుకు రూ.10వేల వరకూ లబ్ధి
జిల్లాలో 1,107 మంది ఎస్సీ రైతులకు పథకం వర్తింపు
