
● టీడీపీ, జనసేన నాయకుల మధ్య తీవ్ర విభేదాలు
● నాయకులు నిర్ణయాలు తీసుకున్నా కలిసి పనిచేయలేమని స్పష్టీకరణ
● తాము లేకపోతే జనసేనకు సీట్లు.. ఓట్లు లేవంటున్న టీడీపీ నాయకులు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పవన్‌కళ్యాణ్ టీడీపీ – జనసేన పొత్తు ఉంటుందని ప్రకటన చేసి వారం కాకముందే ఇరు పార్టీల నాయకుల మధ్య పొత్తు పొసగడం లేదు. అప్పుడే క్షేత్రస్థాయిలో తీవ్ర విభేదాలు పొడచూపుతున్నాయి. స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా చేపట్టిన రిలేదీక్షలు, ర్యాలీలకు తెలుగుదేశం పార్టీ నుంచే స్పందన కరువైంది. ఒకటీ రెండు చోట్ల జనసేన కార్యకర్తలు నిరసనకు వచ్చినా తెలుగుదేశం కార్యకర్తలతో ఇమడలేకపోతున్నారు. నాయకులు ములాఖత్‌లూ.. మిలాఖత్‌లూ అయితే మాత్రం తాము వారికి ఓటేయాలా.. అంటూ బాహాటంగానే విమర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరని జనసేన కార్యకర్తలు విమర్శిస్తున్నారు.
ఆయన పల్లకీకి బోయీలు కాలేం
తెలుగుదేశం పార్టీ వేసే మెతుకుల కోసం తాము రావాలా.. వాళ్లు చెప్పినట్టు నడుచుకోవాలా.. ఆయన సీఎం కావడానికి పల్లకీ మోయడానికి మేము బోయీలుగా ఉండాలా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలే తెలుగుదేశం పార్టీ అంతిమ దశలో ఉందని, దీనికి తాము ఇప్పుడు ఊపిరి పోయాలా అంటూ కిందిస్థాయి కార్యకర్తలు మాట్లాడుతున్నారు. పైగా చంద్రబాబు వివిధ స్కాముల్లో ఇరుక్కున్నాక టీడీపీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి ఉందని, ఈ సమయంలో ఆ పార్టీతో నడవాలని చెప్పడం సరి కాదని పవన్ కళ్యాణ్‌పైనే కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు.
అభిమాన సంఘాలుగా కలిసేదే లేదు
అనంతపురం జిల్లాలో సినిమా నటులకు ఎప్పటినుంచో అభిమాన సంఘాలున్నాయి. ఇందులో ప్రధానంగా చిరంజీవి, పవన్‌కళ్యాణ్ అభిమాన సంఘాలతో పాటు మహేష్‌బాబు, బాలకృష్ణ అభిమాన సంఘాలు ఉన్నాయి. చిరంజీవి, పవన్‌కళ్యాణ్ అభిమాన సంఘాల్లోని యువకులు పలువురు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వలేమని, అవసరమైతే ఎన్నికలకు దూరంగా ఉంటాం గానీ, టీడీపీకి ఓటు వేయలేమని తెగేసి చెబుతున్నారు. ‘పైస్థాయిలో నాయకులు సవాలక్ష మాట్లాడుకుంటారు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు వాళ్లకేం తెలుసు? జెండాలు మోసే మాకే తెలుస్తుంది’ అంటూ పేర్కొంటున్నారు.మరీ ముఖ్యంగా బాలకృష్ణ అభిమాన సంఘం అంటే వీళ్లకు అస్సలు పడదు.
పొత్తును జీర్ణించుకోని సామాజికవర్గాలు..
జిల్లాస్థాయిలో నాయకులను సంప్రదించకుండా, పార్టీలో ఎవరితోనూ చర్చించకుండా జైల్లో ములాఖత్‌కు వెళ్లి బయటికొచ్చి టీడీపీ–జనసేన పొత్తు ప్రకటించడాన్ని పవన్‌కళ్యాణ్‌కు మద్దతుగా ఉండే కొన్ని సామాజిక వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. నాలుగు రోజులుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఆయా సామాజిక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహించుకుని తెలుగుదేశం పార్టీతో కలిసేది లేదని నిర్ణయించినట్టు తెలిసింది. అనంతపురం, కళ్యాణ దుర్గం, ధర్మవరం, రాప్తాడు, గుంతకల్లు లాంటి కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుపై తీవ్రంగా మండిపడుతున్నారు. తెలుగుదేశం, జనసేన ద్వితీయ శ్రేణి నాయకుల్లో అయితే పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అవసరానికి వాడుకుని వదిలేసే రకం మీరు అని జనసేన నాయకులు అంటుండగా... మేము లేకపోతే మీకు ఓట్లు, సీట్లు ఎక్కడున్నాయి అంటూ తెలుగుదేశం నాయకులు వెటకారంగా మాట్లాడుతున్నారు. దీంతో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో జనసేన–తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు ఏ మాత్రమూ పొసగదు అని అంటున్నారు. ఇదిలా ఉండగా హైకోర్టులో శుక్రవారం చంద్రబాబు తరఫున వేసిన క్వాష్ పిటీషన్ కొట్టేయడంతో తెలుగుదేశం పార్టీలో మరింత నైరాశ్యం ఏర్పడింది.